Wednesday, December 30, 2015

!! అనువాద కవి !!

అంతా కవిత్వమే!

జీవన ప్రవాహమిలా
పాయలుపాయలుగా చీలకముందు
దేహము ప్రాణము కలిసి పాడిన స్వఛ్చసంగీతం

వెలుగుకాని
చీకటికాని
విభజనరేఖపై నిలబడి
వింతకాంతితో స్పృశించిన సందిగ్ధం

లోలోపలి రహస్యదారులపై రాలినపూలు
నిన్నటిదాకా మాట్లాడిన భాష

నగ్నదేహాన్ని పదేపదే తాకుతూ
అదృశ్య రక్షాకవచాన్ని కప్పిపోతూన్న
ఒక్కో మంచుఋతువు వాత్సల్యం

కనురెక్కలనంటి
సుదూర గమ్యాన్ని స్వప్నిస్తోన్న కల

అంతా కవిత్వమే..
అక్షరాల్లోకి తర్జుమా చేస్తూ నేనో అనువాదకున్ని.

Sunday, December 27, 2015

!! ప్రేమ కథ !!

ఆమె. తన నులివెచ్చని వేళ్లతో నా చెంపలను నిమురుతూ ప్రతీరోజూ ఒక సరికొత్త ఉదయాన్ని అందిస్తుంది. తనకోసం నిరీక్షించిన వేనవేల చీకటియుగాలు ఆ వెచ్చని స్పర్శలో వెలిగిపోతాయి. చల్లగా నిశ్శబ్దంగా పరుండిన రక్తప్రవాహాలు కొత్తవేగంతో ఉరకలెత్తుతాయి. క్షణక్షణానికీ రెట్టింపయ్యే తన ప్రేమశక్తిని తనువుతీరా నింపుకునేందుకు నేను వెర్రిగా పరిగెత్తుతాను. నా పరుగుల వేగాన్ని కలుపుకుని తను మరింత ఉద్రిక్తమవుతుంది. భగభగ మండే జ్వాలంబర ధారిణై శిరస్సునెక్కి ప్రేమతాండవం చేస్తుంది. భరించలేకపోతాను నేను. నీడకోసమూ, చల్లదనం కోసమూ వెంపర్లాడే నన్ను చూసి తనే శాంతిస్తుంది పాపం. ఒక్కోమెట్టూ దిగుతూ నన్ను ఒల్ళోపెట్టుకు లాలిస్తుంది. తిరిగి ఉదయమంతటి ప్రశాంతత తన ముఖంలో. తన కళ్లలోకి చూస్తూ నేనేవేవో రహస్యాల రహదారుల్లో ప్రయాణిస్తాను. కరుణ పొందుతాను. కవిత రాసుకుంటాను. పాలింపబడతాను. ప్రేమించబడతాను. ఆ దారుల మలుపుల్లో నన్ను నేను మరచిపోతాను. సరిగ్గా అపుడే, నారింజ వర్ణంలో ధగధగ మెరిసిపోయే పడమటివాకిలి గుండా ప్రవేశిస్తుందొక రాక్షస రూపం. నల్లని దేహంతో మిలమిలమనే ఒంటికన్ను రాక్షస రూపం. ఏ మాయ చేస్తుందో ఏ మంత్రమేస్తుందో నా ప్రేయసిని మాయం చేస్తుంది. నా రోదనలో దిక్కులు దిక్కులేనివవుతాయి. వెతికివెతికి విసిగిపోయి నిస్సహాయుడనై కూలబడిన నన్ను గుండెల్లోంచి పొంగుకొచ్చిన రెండు కన్నీటి చుక్కలు నిద్రపుచ్చుతాయి. చీకటియుగాల నిరీక్షణ తిరిగి ప్రారంభమవుతుంది.

ఇంతకీ తన పేరేమిటో చెప్పలేదు కదూ... సూర్యణి.

Thursday, November 26, 2015

!! నిత్యసత్యం !!

అవును కదా,
ఎంత నిస్సహాయతను కొనితెచ్చుకుంటున్నామో!

కంటిచూపు, చేతిస్పర్శ, మనసూ, మాటలూ నెరపాల్సిన మానవసంబంధాల్ని ఏ ఆధునిక ఉపకరణాలకో ఏ అవ్యక్త అనుభూతులకో అప్పగించేసి ఎవరికివారిమై ఏకవ్యక్తి సమూహాల్ని నిర్మించుకుంటున్నాం.

ఖాళీ లేదు. ఏకాంతం లేదు. కలల్లేవు. కరుణ లేదు. కవిత్వం లేదు.

ఉన్నదల్లా గమ్యం తెలియని ఉరుకులాట.గెలుపోటములు మాత్రమే మిగిలిన ఆట. పెనుగులాట. ముసుగులో గుద్దులాట. దేహసరిహద్దుల్లోనే కనుమరుగవుతోన్న మానవతాపాట.

ఎన్నాళ్లయిందో ఎదుటివ్యక్తి కళ్లలోకి చూసి ఒక్క చిర్నవ్వు నవ్వి. ఎన్నాళ్లయిందో ఒక తడిచెంపమీద చేతులేసి సేదదీర్చి. ఎన్నాళ్లయిందో ఒక పాటలోని గమకానికి పరవశమొంది. ఎన్నాళ్లయిందో పసిబుగ్గల పాపాయిని పైకెగరేసి పట్టుకుని. ఎన్నాళ్లయిందో... కిటికీపక్కన గువ్వపిట్టకు గుప్పెడు గింజల్ని గుమ్మరించి.

ఏ అగ్నిపర్వతపు ఎద బద్దలైనపుడు ఎగిరిపోయిందో మనలోని సున్నితత్వం. మనలోని మృదులత్వం. మనలోని మనిషితనం. ఏ ఉప్పెన ఎత్తుకెళ్లిందో ఏ భూకంపం పెకిలించివేసిందో ఏ మహాకుంభవృష్టి తుడిచేసిపోయిందో..

కంటిచూపుని కాజేసిన కాళరాత్రి రంగు తెలియదు. చేతిస్పర్శను మింగేసిన చేదు క్షణాలు గుర్తుకురావు. మనసెప్పుడు మాయమయిందో మాటలెప్పుడు మౌనసంద్రంలో మునిగిపోయాయో లెక్కతెలియని అమాయకత్వం. లెక్కేదొరకని అభద్రత.

కన్నుతెరిచింది మొదలు కాళ్లకొకటే పని. ఎన్ని వలల్లో చిక్కుకుంటుందో ఎన్ని వలయాల్లో ఇరుక్కుపోతుందో ఏకాంతం ఎదుటకు రాదు. కంటినిండా నిద్ర కరవై కలవరింతల కలలు పండకుండానే రాలిపోతాయి. కరుణసాగరంలో పొంగుకొచ్చే అలలు తీరం చేరకుండానే గడ్డకట్టుకుపోతాయి.

నీకూ తెలియదు. నాకూ తెలియదు. కాలమెలా కదులుతోందో ఎక్కడెలా ఆగుతోందో మళ్లీ ఏ మలుపులో మొదలవుతోందో. ఏ గాయాలను మాన్పుతోందో ఏ చరిత్రపుటలకి అక్షరాలిస్తోందో ఏ మూలలో ఎవర్ని ఎందర్ని దాచేసిపోతోందో.

నేస్తమా! ఇలాగే నడుస్తూ పోదామా? శవపేటికకు ఒక్కో పుల్లను పేర్చుకుంటూ?


(అఫ్సర్ మొహమ్మద్ గారి కవితొకటి చదివినపుడు మెదిలిన భావం)

Wednesday, November 25, 2015

!! నగ్నహృదయం !!

రెండురెక్కలు మొలిపించుకుని దిక్కులకెదురేగాలి
కొంత ధూళిని కప్పుకుని కొన్ని మెరుపుల్ని పూసుకుని
ఎప్పటికీ రాలని నక్షత్రాన్నై నిలవాలి

మట్టిరేణువులకు మనసివ్వాలి
కాస్తంత చేతులకి కాస్తంత కాళ్లకి ఇంకాస్తంత హృదయానికీ రాసుకుని
నేనొక మట్టిమనిషినవ్వాలి

కమిలిన మనసుదేహంపై తడితడిగా తగిలే
నిస్స్వార్థ పిల్లగాలుల్ని ప్రేమించాలి
వెన్నెల్లో దూరి వేణువులో చేరి వేదనలో జారి
వాటితో కలిసి పాడాలి నేనే వొక పాటనవ్వాలి

ఆకాశం అడుగుల చప్పుడుమోస్తూ నేలకు రాలే
చినుకుల భాష నేర్చుకోవాలి
ఒక్కో అక్షరాన్ని పొదువుకుని ఒక్కో సందేశాన్నీ నింపుకుని
సెలయేటి కావ్యమై
నేనొక మహాసముద్రమవ్వాలి

పక్షిలాగా
పచ్చనిమట్టిలాగా
పిల్లగాలిలాగా
పచ్చిచినుకుల్లాగా
నేనొక నగ్నహృదయాన్ని నిర్మించుకోవాలి.

Sunday, November 15, 2015

!! పరిణామం !!

పక్షులు స్వేచ్చగా ఎగరడం నేర్చుకున్నాయి
మొక్కలు పువ్వులు పూయడం నేర్చుకున్నాయి
చేపలు సముద్రం ఈదడం నేర్చుకున్నాయి
అయిదులక్షలేండ్లు అడుగులేసీ
మనిషి
నేటికి నేర్వగలిగిందొక నెత్తుటిభాష

అంతరిక్షంలో అడుగుపెడుతూ
అంతరాల అగాథాల్లోకి జారిపడుతూ
ద్వేషాన్నీ దాటలేని దుస్థితి
ప్రేమను పంచలేని దైన్యం

ప్చ్!!
మనిషి
సుఖంవైపు కాక
స్వచ్ఛతవైపు పరిణమించాల్సింది

Tuesday, November 3, 2015

!! అంతే... !!

ఎంతగింజుకున్నా
ఒక్క గ్రీష్మజ్ఞాపకమూ
స్మృతిపథంలోంచి పక్కకిపోదు

ఎంత పెనుగులాడినా
ఒక్క చీకటిరహస్యమూ
ఉచ్ఛ్వాసనిశ్వాసాలను వీడిపోదు

ఆలోచనల వధ్యశిలపైనుంచి
ఎగిరిపడే శిరస్సుల లెక్కతేలదు
అంతఃఘర్షణల అడవిదారిలో
అసలెంతకూ గమ్యం దొరకదు

అనువదిద్దామంటే
అక్షరాలుగా మార్చి ప్రవహింపజేద్దామంటే

కల్లోలకడలి దాటి
ఒక్క అక్షరమూ ఒడ్డుకురాదు
మస్తిష్క మేఘావళి కరిగి
ఒక్క చినుకూ కవిత కాదు

శాంతిదొరికేదల్లా,
భోరున కురిసే వానను చూసినపుడూ
వానలో తడిసే దూరపు కొండను కలిసినపుడూ
అంతే!

Friday, October 23, 2015

!! వాయుసంలీనం !!

వేగం తెలీకుండా
వెదురులోంచి ఒక చల్లనిగాలి వీస్తోంది

చిక్కుబడిన ముడుల్లోంచి
ఒక్కోదారప్పోగును వేరుచేస్తున్నట్టు
చిక్కబడిన చీకటిలోంచి
వెలుగురేఖలను వెలికితీస్తున్నట్టు

ఒకానొక ప్రాచీన లిపికి
కొత్తభాష్యం చెబుతున్నట్టు
రాలుతున్న ఒక్కో పూరేకునూ
రేపటిజన్మకు పదిల పరుస్తున్నట్టూ

వేదన తెలీకుండా
వెదురులోంచి ఒక మెత్తనిగాలి వీస్తోంది

!! ఆకుపచ్చని గాయం !!

వానలో తడిసిన ఒంటరి రహదారి
రహదారిపక్కన ఆకులు రాలిన చెట్టు
చెట్టుమీద కూచుని ఒక తెల్లపావురం
పావురం రెక్కల్లో ఒదిగిన వెచ్చని నిశ్శబ్దం
అన్నింటితోనూ
ఇప్పుడిక నిరంతర సాహచర్యం


అద్దంలో పగిలిన నీడ
నీడను మింగేసిన నిశీధి
నిశీధిలో కురిసే గతం
గతంలో తడిసే నిజం
అన్నీ చేరి
బతుకు ఒక ఆకుపచ్చని గాయం

Wednesday, August 12, 2015

!! కలవరింత !!

ఈమధ్య
కలలు రావడంలేదు

ఉషోదయాత్పూర్వమే మేల్కొని
ఆకుపచ్చని ఆ అడవుల్లో కోకిలనై చిలుకనై నెమలినై
పొగమంచును పాటలుగా మర్చినట్లు ఒక కల వొచ్చేది

ఈ మహావృత్తం అంచున
ఒకానొక మైదానంలో గడ్డిమొక్కలోపలి పత్రహరితాన్నై
సూర్యరశ్మిని రూపాంతరం చెందించినట్లు ఒక కల వొచ్చేది

సముద్ర ఉపరితలమ్మీంచి
సన్నగా వీచే గాలితరగనై అలనై తీరాన్నితాకి
ప్రేమను అనువదించినట్లు ఒక కల వొచ్చేది

ఎడారిలో
ఒంటరి ఇసుకదిబ్బ మాటున సూర్యుడినైనట్లు
నిశీధిలో
ఒంటరి నక్షత్రానికి నేనొక తోడునైనట్లు
మెరిసే చినుకునైనట్లు కురిసే వెన్నెలైనట్లు
ఎన్నో కలలొచ్చేవి..
కొంచెం కొంచెం నన్ను ఒంపుకునేవి నింపుకునేవి
నిదురలోంచి దూకి నాలో నిండిపొయేవి
---
ప్రకృతితో మాట్లాడ్డం మానేశాక
ఈమధ్య
అసలుకలలు రావడం లేదు...అన్నీ పీడకలలే!

Monday, June 15, 2015

!! శ్రీశ్రీ కి నివాళి !!

నిగనిగల ఎర్రబావుటా
నిగ్గు నాకు తెలియకముందే
జగన్నాథుని రథచక్రాల
సిద్ధి మంత్రం ఎరుగకముందే
మహాకవీ!
నీ కలం పాడిన నిట్టూర్పుల గీతం
నా గుండెను నిండింది
కవితకు గుడికట్టిన నీ నుడి
నా ఒడిచేరింది.. నన్ను కౌగిలించింది

నిశ్శబ్దము రాజ్యమేలే నా మదిగదిలో
నిప్పులు కురిపించింది నీ గీతం

కురుస్తున్న నిప్పుల చప్పుడులో
విన్నానయ్యా శ్రీశ్రీ!
సమరాజ్యమనే సైకతశిల్పం
చెదురుతోన్న దీనగాథ

కురుస్తున్న నిప్పుల కాంతిలో
చూశానయ్యా శ్రీశ్రీ!
వ్యథార్త జీవుల
ఎడారి బ్రతుకుల
కారునల్లటి నలుపు
ముసుగేసిన మెరుపు

నెత్తురు మండించి
మండే నెత్తురునిండా
శక్తులు పారించి
మరోప్రపంచపు అంచుల
మెరుపులు పలికించి
నా మనసు గెలిచిన మహాకవీ,
నీకిదే నా నివాళి!

(తెలుగు రక్తాన్ని ఉరకలెత్తించిన రెండక్షరాలు శ్రీశ్రీ! సాహిత్యాంధ్రకు సంకెళ్లుదెంచినవాడు.. అక్షరాలకు ఆకాశం ఈదడం నేర్పినవాడు.. ఇరవయ్యొవశతాబ్దపు అసలుముద్ర.. ఈ అరుణతార అంబరమంటి నేటికి ముప్పైరెండేళ్లు.. ఒకవేళ బతికేఉంటే శ్రీశ్రీ, ఎరుపురంగుకి తనప్రాణాలను పూసిన వివేక్ హత్యను విని ఇవాళే చనిపోయేవాడేమో!)

Wednesday, June 10, 2015

!! నిన్ను చూడాలని !!

నాటకాలాడి
నయగారాలు పోయీ
నవ్వి నవ్వించీ
నిదురదోచిన నక్షత్రమా
నీకోసమే నిరీక్షిస్తున్నాను
నిన్ను చూడాలనే తపిస్తున్నాను

తలపులరెక్కలు
తనువున తాపం పెంచుతున్నాయి
ఊసులు ఉప్పెనలై
ఊపిరి బరువును పెంచుతున్నాయి
ప్చ్...
ఈ పగలిలా పగిలిపోతే బావుణ్ణు
ఆ ఆకాశం కాస్త దగ్గరైతే బావుణ్ణు
నిన్ను చూపే చల్లని ఆ రాత్రేదో
ఇవాళ కొంచెం త్వరగా వస్తే బావుణ్ణు

నవీన్ కుమార్ !! 10/06/15

!! కొత్తచినుకులు !!

ఈ వర్షం
ఎప్పటిలా కురవడం లేదు
చినుకులకెవరో మోసంరంగు పులిమినట్టు
కొంచెం స్వార్థంవాసన చేర్చినట్టు
అచ్చం అతని కన్నీళ్లలా..
తనువంతా చీకటిని నింపుకుని
పైకిమాత్రం
చిటపటమనే వెలుగుశబ్దాలతో
అచ్చంగా ఆమె మనసులా..
కొత్తగా కురుస్తోంది
అయినా, ఈ వర్షం
అందంగానే ఎందుకుందంటావ్?

Monday, April 13, 2015

!! నీలాంటి వాన !!

ఉరుమురమగానే
మెరుపు మెరవగానే
నీ రాక తెలుపు తడి
చెక్కిలిని తడమగానే
నెచ్చెలీ
నిన్ను హత్తుకున్న భావన
నీలో నే కలిసిన భావన

చినుకులు మొదలవగానే
చప్పుడు చెవి చేరగానే
నీతో మాటలు మొదలైన భావన
మాటలన్నీ కవితలైనట్టు
కవితలన్నీ కాగితపు పడవలై
కాలమనే కాలువలో కదిలినట్టు..

Monday, April 6, 2015

!! పంచరత్నాలు !!

ఆకాశం ఏకధాటిగా
వర్షించిన చీకటి
వెలుతురు తాకి గాలిపొరల్లోకి ఇంకితే
అది ఉదయం

చీకటివేదన అనుభవించి
రాత్రి ప్రసవించిన
పండంటి బిడ్డ సూర్యుడు

నిశ్శబ్దంగా
నిశీధి చేసే సంగీత కచేరికి
ఆలాపన సంధ్య

నే కనబడగానే
నా కంటబడగానే
మిణుకుమిణుకుమంటూ రహస్యాలు విప్పే
చిరనేస్తాలు నక్షత్రాలు

వొయ్యారంగా ఊగుతున్న
కొబ్బరిచెట్టు సిగలోని
మల్లెచెండు చందమామ

Sunday, April 5, 2015

!! నన్న బెంగళూరు !!

ఒకసారి బెంగళూరు పొయిరావాలి

ఆ పచ్చనినీడల్లో నడుస్తూ
ప్రపంచం నలుమూలల్నుంచి వీచే
గాలుల్ని ఆస్వాదించాలి

లాల్‌బాగ్ తోటల్లో
ఉడతల్నీ మిడతల్నీ పలుకరించి
ఓ ఆదివారపు ఉదయాన్నో సాయంత్రాన్నో
వాటికి కానుకిచ్చి రావాలి

FORUM లో విండోషాపింగ్ చేయాలి
కుదిరితే దానిముందు కూచుని
గజిబిజిగా మనుషులరూపంలో తిరిగే
గందరగోళాన్ని చూడాలి
చూస్తూచూస్తూ
వేడివేడి మొక్కజొన్న పొత్తులు తినాలి
తింటూతింటూ
Paulo Coelho ని చదవాలి


కేఆర్ మార్కెట్ లో
పువ్వులెలా నవ్వుతున్నాయో!
E-city లో
నాతో నడిచిన దారులెలా ఉన్నాయో!
'మెట్రో సవారీ'పై
RJ రష్మి ఏమంటోందో!

ఒకసారి బెంగళూరు పొయిరావాలి

కలలకు రెక్కలిచ్చిన క్షణాలు
కన్నీళ్లకు అర్థం మార్చిన క్షణాలు
అక్కడే పదిలంగా ఉన్నాయి
ఒక్కసారి వాటిని పరామర్శించి రావాలి

Saturday, January 10, 2015

!! ఇల్లు కావాలి !!

ఇల్లొకటి కావాలి

ఏఊరివారినైనా
ఏకాలపు వారినైనా
అడ్డగించకుండా అనుమతించేందుకు
తలుపుల్లేని ద్వారాలుండాలి

ఏరకపు గాలైనా ధారాళంగా లోపలికొచ్చేందుకు
ఉదయాస్తమాల వెలుగుచీకట్లను సమంగా నింపేందుకు
తెరలు లేని కిటికీలుండాలి

నావాళ్లు నానా నమ్మకాలు గలవాళ్లు
ఏనమ్మకపు సువాసనలైనా
నిర్భయంగా తిరుగాడేందుకు
విశాలమైన గదులుండాలి

అలసినపుడొ
ఆవేదన వరించినపుడో
సేదదీరడానికి ఒక చెట్టుండాలి
చెట్టు చుట్టూ సంగీతం పలుకుతుండాలి

పూబాలలు
నాపిల్లలు
అందంగా నిండుగా విరబూయడానికి
సారవంతమైన పెరడొకటుండాలి

నాకొక ఇల్లుకావాలి
నా మనసులాంటి ఇల్లు

కనిపించినపుడల్లా
చిరునవ్వు కరచాలనం చేస్తాను
నెలకో వారానికో రోజూనో
ఒక ఆత్మీయ ఆలింగనాన్ని అద్దెగా ఇస్తాను

నాకొక ఇల్లుకావాలి
అచ్చంగా నా మనసులాంటి ఇల్లు


నవీన్ కుమార్ !! 10/01/2015

Sunday, January 4, 2015

!! రాత్రి !!

పడమటి అంచు
అందంగా రంగులు మారుతుంటుంది
అదృశ్యశక్తులేవో
నింగిపైకి నక్షత్రాల వర్షం కురిపిస్తాయి
పిల్లకాలువలో కాగితప్పడవలా
చందమామ తేలుతూ వస్తాడు
నిశ్శబ్దంగా రాత్రి నిద్రలేస్తుంది

శీతాకాలపు సమీరంలా
పాదాలను తాకి
నిగూఢ సందేశాలు దాగిన పరిమళంలా
దేహాన్ని చుట్టి
నిస్సారపు నీడలు దూరంచేసి
ఆలోచన అడుగులు నెమ్మదిచేసీ
మనసును మరోలోకంలోకి తీసుకెళ్తుంది రాత్రి

కలలకౌగిట బంధించి
వెన్నెలవీధుల తిప్పించి
గుప్పిట గుట్టుగాదాచిన మధురక్షణాలను
గమ్మత్తుగా విప్పుతుంది రాత్రి

శ్రుతితప్పని ఈ లాలిపాటకు
నిదురించని దేహమూ లేదు పులకించని ప్రాణమూలేదు
సుతిమెత్తని ఈ రాత్రిస్పర్శకు
కదలని హృదయమూ లేదు కరగని శోకమూలేదు

Saturday, January 3, 2015

!! ప్రకృతహృదయం !!

ఆకాశంలాంటి హృదయం నాది
మెరుపులగాయాలు కోతపెడితే
కన్నీళ్లను కురిసి
కరిగిన మబ్బులమాటున
నిర్మలత్వాన్ని వెతుక్కుంటుంది

నేలలాంటి హృదయం నాది
దుఃఖాగ్నిపర్వతాలు బద్దలైతే
లావాలా పెల్లుబికి
ప్రవహించిన దారులంతా
సారాన్ని తిరిగి పొందుతుంది

అచ్చంగా రాత్రిలాంటి హృదయం నాది
చీకటిబాణాలు సూటిగా తగిలితే
విలవిలలాడీ
నక్షత్రాల నీడల్లో
వెలుగుకోసం నిరీక్షిస్తుంది

ఎందుకంటే
నా హృదయానికి మనిషితనమెక్కువ
ఎందుకంటే
నా హృదయానికి ప్రకృతితో సారూప్యమెక్కువ

నవీన్ కుమార్ !! 03/01/2015