Thursday, December 19, 2013

!!అమావాస్య చుక్క!!

ఏమరపాటుగానైనా
నావైపు చూస్తావేమో అని..

ఎప్పుడైనా పొరపాటుగానైనా
నన్ను పలకరిస్తావేమోనని..

యెనక పొద్దుజారుతున్నా
ముందు చీకటి మూగుతున్నా

ముఖాన్ని మూడింతలు చేసి
కళ్లుకాయలు కాసేలా చూసీ చూసీ..
అలసి సొలసి ఇక విశ్రమించబోతే,

"అపుడేనా" అన్నట్టు వెక్కిరించాయి
చందమామకోసం చూస్తున్న అమావాస్య చుక్కలు.

అంతే, మళ్లీ లేచి కూచున్నాను..

Tuesday, December 17, 2013

!! నిష్క్రమణం !!

విత్తుగా పుట్టి
వృక్షమై వెలిగినా
ఒకనాటికి
ఆకులురాలి, వేళ్లుకుళ్ళి
మునగదీసుకుని
మట్టిలో కలిసిపోవడమే

ఎంతటి ఎండలకు
ఎదురొడ్డి నిలిచావో
ఎన్నెన్ని వసంతాలకు
ఎద పులకరించి పాడావో
లెఖ్ఖేలేదు.. అది లెక్కాకాదు
ఆనాటికి
నీ కొమ్మల పురుడుపోసుకున్న
పక్షులు ఎగిరిపోతాయి
నీ నీడన తలదాచుకున్న బతుకులు
ఎక్కడివో..మళ్ళీ అక్కడికే పయనమవుతాయి

అల్లుకున్న అనుబంధాలు
నాలుగు కన్నీటి చుక్కలుగా రాలి
శ్రాద్ధకర్మలుగా మారి
మరపువనంలో మొలకెత్తుతాయి
ఆక్షణం
నీ కళ్ళముందు కదలాడే జీవితం
ఒక కల...
కనురెప్ప వాలగానే
కలమాయం..శూన్యంలోకి ప్రయాణం షురూ!!




Wednesday, December 11, 2013

!!ఎవరు నేను!!

 !!ఎవరు నేను!!

నిరాకారమై నిర్వికారమై
సమాశ్వాసమున సత్యమై చెలగిన
నభఃప్రాణము నేను

నిజమై నిత్యయవ్వనమై
నిగనిగల దేహమై ఎగసిన
నిప్పును నేను

అవ్యక్తమై అంతరాళమై
అణువణువుకూ ఆధారమై అందిన
నేలను నేను

నీలమై నిఖిలమై
నవనవోన్మేషముగ తారానిలయమై నిలచిన
నింగిని నేను

చరమై చంచలమై
సెలయేటి ఘోషల సంచలనమై రేగిన
నీరును నేను

అంతరంగమై అనంతజీవనరాగమై
ఆత్మకోకిల గానమై పలికిన
ఓంకారం నేను

నిరతమై అనిగళమై
నిశీధిగుండెల నిషాదమై ధ్వనించిన
కాంతిరేఖను నేను

నియమమై నిరాఘాటమై
నభోపాత్రుని నిరంతరపయనమై సాగిన
కాలప్రవాహం నేను

నిస్వార్థమై నిష్కల్మషమై
సృష్టిగమనానికి సాక్ష్యమై ప్రభవించిన
ప్రేమను నేను

పంచభూతములూ నేనే
పరమార్థములూ నేనే
ప్రకృతినీ నేనే
పురుషుణ్ణీ నేనే...

(.."నువ్వెవరు" అన్న ఆత్మారాముని ప్రశ్నకు పలికిన ఉపశమనం)

Monday, December 9, 2013

!!మరోఉదయం !!

పున్నమిరేయి కరిగిపోతూ
పుడమితల్లిని మేలుకొలిపింది

తూరుపుదిశ ఎర్రబారుతూ
తొలివెలుగుకు తెరలుతీసింది

శుకపికాల కలరవమ్మున
సుప్రభాతం శ్రుతి కుదిరింది

ఉదయభానుని కిరణస్పర్శతో
పొగలుపొగలుగా మంచు తరలిపోతోంది

నల్లగా నిదురపోయిన
ఆకులూ పూరేకులూ రంగులు పులుముకున్నాయి

అవనియవనికపై అందంగా
మరోఉదయం మొదలయింది




Thursday, November 14, 2013

మిథునం చూశారా !

మిథునం చూశారా !

నేనయితే మూడుసార్లు 
లక్ష్మికోసం ఒకసారి 
బాలూకోసం ఒకసారి 
భరణికొసమ్ ఇంకోసారి 

ఆదిదంపతులు 
అభిమానించిన మిథునం 
కాదు కాదు 
అసూయపడిన మిథునం 

అప్పదాసు బుచ్చిలక్ష్మిల 
మిథునం 
అవునవునది 
అచ్చతెలుగు మిథునం 

సరసాల నవరసాల 
మిథునం 
అదే అదే 
ముచ్చటైన  మిథునం 

అన్నట్టు, మిథునం చూశారా ?

నేనయితే మూడుసార్లు 
శ్రీరమణ కోసం ఒకసారి 
జేసుదాసు కోసం రెండోసారి 
జొన్నవిత్తుల కోసం మూడోసారి 

ఇంతచెప్పాకా చూల్లేదంటారా 
ఆశ్చర్యంగా ఉందే!



Wednesday, November 13, 2013

!! ఎన్నాళ్ళిలా!!

మిత్రమా!

ఎన్నాళ్ళిలా ఏడుస్తావురా?

ప్రేమించావూ సరే,
ఫలితమనేదేముంది?

నవ్వుల ముసుగేసున్న కన్నీళ్ళతో నీ
పగళ్ళు పగిలిపోతున్నాయి

నిదుర నిర్దయగా వెలివేసిన నీ
రాత్రులు చుక్కలుగా రాలిపోతున్నాయి

మిత్రమా!

ఎన్నాళ్ళిలా ఏడుస్తావురా?

వలచావూ సరే,
ఓటమనేదెక్కడుంది?

నిశీధి నీడన కరిగిపోయిన
నిన్నల్లోనే నిలిచిపోతావా..

నీళ్ళలా జారిపోనీక
ఙ్ఞాపకాలకు దోసిలి పడతావా..

ఆలోచించు
ఉలితగలని శిల
శిల్పమయిందేమో గుర్తించు..

ఆలోచించు
వెక్కిరించిన విధికి
వెరవక దాని మెడలు వంచు

అంతేగానీ, మిత్రమా!

ఎన్నాళ్ళిలా ఏడుస్తావురా?

Tuesday, November 12, 2013

!! ఉత్తినే సరదాకి !!

రోజూ జరిగే సూర్యోదయమే
ఈరోజు మాత్రం
కొత్తగా..
ప్రశాంతంగా..

రోజూ జరిగే సూర్యాస్తమయమే
ఈరోజు మాత్రం
నిదానంగా..
నిమ్మళంగా..

విషయమేమిటంటే,

పెళ్ళాం ఊరెళ్ళింది..:p

నవీన్ కొమ్మినేని !! 12/11/2013 !!

Friday, November 8, 2013

కష్టాలకు తోడు...

కష్టాలా? ఒంటరిగానా? ఎప్పుడూ రావే...

ఎదురొడ్డే తత్వమున్నవాళ్ళకి
పాఠాలతో కలిసొస్తాయి

ఏడ్చే తత్వమున్నవాళ్ళకి
కన్నీళ్ళతో కలిసొస్తాయి

తెలివైనవాడయితే కష్టం వెంటే
సుఖమొస్తుందంటాడు

తెలివిలేనివాడయితే
ఇంకోకష్టం వస్తుందంటాడు

మొత్తానికైతే కష్టాలు ఒంటరిగా రావు...

(కష్టాలు ఒంటరిగా వస్తాయా అన్న మిత్రుని ప్రశ్నకు సమాధానంగా రాసింది...)

Wednesday, November 6, 2013

కలా - కన్నీళ్ళు

సాఫీగా సాగుతున్న కల
సగంలోనే మెలకువొచ్చింది
కళ్ళుతెరచి చూద్దునుగదా
కుప్పలు తెప్పలుగా
ముక్కలు ముక్కలుగా
పడున్నాయి..నిజాలు

ఆశ చావకనో, నిజాన్ని భరించలేకనో
మళ్ళీ కళ్ళు మూసుకున్నాను..
ఊహూ లాభం లేదు..
సమయం మించిపోయింది..
కలచెదరి పశ్చాత్తాపం మిగిలింది
కన్నీళ్ళుగా..

Wednesday, October 30, 2013

!!అలలు కలలు!!

అదుపులేని  ఆలోచనలు 
అలలలా అలా అలా 

కుదురులేని మదికంపనాలు 
నీ కలలప్రవాహాల...  

Friday, October 4, 2013

ఇపుడింకోపాఠం

జీవితం ఎంత గొప్పదో కదా అనిపిస్తోంది.. ఎంతగానో ఇష్టమైన ఒక విషయం నుంచి దృష్టి మరల్చడం ఎంత కష్టమో అర్థమవుతోంది..
ఆశ అసంతృప్తికి అసలు కారణం అని ఎంత తెలిసినా ఇస్టమైనవాళ్ళ నుంచి ఏదో ఆశిస్తాం. అక్కడే మనకోసం ఒక పాఠం సిద్ధంగా ఉంటుంది. తెలుసుకోలేం.
 మనుషులుగానీ, వస్తువులుగానీ మరేవిషయమైనా గానీ మన దగ్గర ఉన్నప్పుడు నిఝంగా వాటివిలువ తెలియదు. ఆత్మాభిమానానికీ, అహంకారానికీ మధ్య ఉన్న చిన్న రేఖను గుర్తించకుండా ఏదో చేసేస్తాం.తిరిగి అతుక్కోలేనంతగా మనస్సును విరిచేస్తాం. మాటలనే తూటాలను విచక్షణ లేకుండా పేలుస్తాం.
మనం చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడేలోపు జరగాల్సిందంతా జరిగిపోయుంటుంది. మళ్ళీ ఒక పాఠం.
చేసిన తప్పు తెలుసుకొని తిరిగివెళ్తామా, సరిగ్గా అదేసమయంలో ఒక నిరాదరణ ఎదురవుతుంది. మధ్యన ఏర్పడిన ఒక గోడ మాత్రం స్పష్టంగా కనపడుతుంది.మనం కోల్పోయిందేమిటో స్పష్టంగా అర్థమవుతుంది...    అప్పుడు కలిగే బాధను వర్ణించడం మాటల్లో చేతకాదు.
కానీ నేస్తం, మొదటే చెప్పినట్లు జీవితం చాలాగొప్పది. అది నేర్పించే ప్రతిపాఠం నేర్చుకోవాల్సిందే. మళ్ళీ ఇంకో పరీక్షకు సిద్ధం కావాల్సిందే.

Wednesday, September 25, 2013

ఆశావాదము

శ్రీ అడపా రామకృష్ణారావు గారి "సోక్రటీసు" రేడియో నాటకం చదివాను... స్వార్థపరులు, దుర్మార్గుల గురించి ఆవేదన చెందుతున్న తన శిష్యునితో సోక్రటీసు చెప్పే ఈ క్రింది మాటలు బాగున్నాయనిపించింది.
ఇంతటి ఆశావాదం అలవరచుకోవడం, అందుకు తగ్గట్టు జీవించడం సాధ్యమా అనిపించింది.

" ఈ చెట్టు ఒక చిన్న కొండమీద ఉంది. ఈ కొండ ఏథెన్స్ కు దగ్గరలో ఉంది. ఏథెన్స్ గ్రీసు దేశంలో ఒక మూల ఉంది. గ్రీసు దేశం ఈ విశాల ప్రపంచంలో ఒక చిన్న చుక్క. ఈ ప్రపంచం విశ్వంలో అంతకన్నా చిన్నచుక్క."
...
"ఇక కాలం సంగతి చూద్దాం. అంతులేని కాలప్రవాహంలో మానవ జీవితకాలం ఎంత స్వల్పమో ఆలోచించు. సృష్టిలో మొదట మానవునికి జంతువులకూ భేదం లేదు. క్రమంగా మానవజాతిలో ఎలాంటి వికాసం కలిగిందో చూడు. మానవజాతిలో ఎందరు కవులు ఎందరు శిల్పులు మహానుభావులు జన్మించారు. ఈ కాలం లో మానవజాతికి వికాసం కలగలేదంటావా?"

"మానవజాతి ఇంకా బాల్యదశలోనే ఉందని తెలుసుకో. తరాలతో పాటు మనిషిలో విజాఞనం క్రమంగా వికసించడం లేదూ? ఒక నాటికి మనుషులు తమ లోపాలన్నింటినీ జయించి, హింస, వంచన, స్వార్థం అన్నీ విడిచి ప్రేమభావంతో జీవిస్తారేమో? మనమంతా మరణించిన తరువాత ఒక నాటికి అలాంటి కాలం వస్తుందేమో? "

Monday, September 23, 2013

నువులేక సగమైన నేను

కులముంది మతముంది
మనసేగ మాయం..

ఏనాడు ముగియాలి
బరువైన ప్రాణం..

నువులేని నేనీక్షణం
నీడై కరిగానులే అనుక్షణం....

నీ రూపే కొలువున్న కనులింటిలో
కన్నీటిసంద్రాలే కలలెక్కడో..

నిత్యాలు సత్యాలు మన ప్రేమలూ
వికసించు మరుజన్మలో..
                        

Tuesday, August 20, 2013

చినుకులూ చిత్రాలు-2

భోరున వర్షం
ఎడతెగని వర్షం
ఎదమాటున ఏకధాటిగా వర్షం
కలలను కరిగిస్తూ
జ్ఞాపకాల చారికలను కానుకిచ్చిన వర్షం..
నింగీనేలని ఏకం చేసి
కంటిని కడలి చేసిన కన్నీటి వర్షం..
  

Thursday, August 15, 2013

ప్రాణమొక ప్రశ్న!

పగలూ రాత్రీ తేడా లేకుండా
ప్రతీక్షణం నీ తలపులు పరీక్షిస్తుంటే, పరిహసిస్తుంటే...
ప్రాణం పోక నిలిచిన దేహం
ప్రశ్నగా మిగులుతోంది...

Tuesday, July 30, 2013

ఉదయం

కరగిపోయె కలయని
కలవరపడకు నేస్తం
కనులు తెరచి చూడు
తూరుపు కనబడుతుంది

చెదరిపోయె మనసని
చింతించకు నేస్తం
చిరునవ్వున చూడు
చెంతకు తిరిగొస్తుంది

వెడలిపోయె వెలుగని
వేదన వరియించకు నేస్తం
వేయి సూర్యులతోటి 
వేకువ ఎదురొస్తోంది  

Friday, July 26, 2013

చినుకులూ..చిత్రాలు..

కిటికీ పక్కన కూచొని
కాఫీ తాగుతూ నీ తలపుల్లో నేను..
కంటికింపుగా కొమ్మమీద
మందారపువ్వు కదులుతూ ఉంది
నీ నవ్వులాగా...
ఉన్నట్టుండి ఊహలన్నీ
గాలిలో మేడలు కట్టి మేఘాలయ్యాయి..
ఒక్క ఉరుముతో ఉలిక్కిపడి
బయటకొచ్చానో లేదో
మోము తాకే ప్రతి చినుకూ
చెలియా..
నీ మోహన రూపమై పలకరించింది...
               .... నవీన్ కొమ్మినేని

Thursday, July 25, 2013

నా మౌనం

చేసుకున్న బాసలు
బాణాలై గుచ్చుతున్నాయి
కలబోసుకున్న ఊసులు
ఉప్పెనలై ముంచుతున్నాయి
కరుణ లేక కన్నీళ్ళు
కాలువలు కడుతుంటే
మాటలు రాక మౌనాన్ని ఆశ్రయించాను...
                     .... నవీన్ కొమ్మినేని

Tuesday, July 23, 2013

నిశ్శబ్దంగా.. నీలా

సమున్నత హిమ శిఖరం అంచు
నా హృదయం లో నీ స్థానం..
కరుగుతున్న మంచు చారికల్లా
నీ జ్ఞాపకాలు..
                ....నవీన్ కొమ్మినేని

Monday, July 22, 2013

ఏకాంత గానం

మోడువారిన చెట్టు
మళ్ళీ చిగురించునేమో
మూగబోయిన మనసు
మళ్ళీ పలికేదెలా.......
               ....... నవీన్ కొమ్మినేని