Sunday, April 4, 2010

అన్నీ కలలే...

అన్నీ కలలే... అంతటా కలలే..

చిధ్రమైన రైతు బతుకు
చిరునవ్వుల మయమైనట్టు
నేల తల్లి కడుపు పండి
నవ ధాన్యపు సిరులు పారినట్టు..

నేసి నేసి అలసి సొలసిన
నేతన్నల తెరువు భాసిల్లి
బలవంతపు మరణమాగి
భాగ్యరాసులు పొంగినట్టు..

బాలకార్మిక వ్యథల కథలలో
భంగపడిన పసిడి భవిత
బోసినవ్వుల జతనుగూడి
బడితలుపులు తట్టినట్టు..

వరకట్నపు చీడసోకి
వడలుతున్న మన సమాజం
"వద్దు" అనిచెప్పి, వరసకట్టి
వాస్తవికత పిచికారీ చేయించుకున్నట్టు..

కులముకులమని వెర్రులెత్తి
కుళ్ళుతున్న కుటిల జనం
కులమన్నది కాదు గెలుపు
కలిసుండటంఅని తెలిసినట్టు..

మనిషి మనిషికీ గోడ కట్టే
మనసులేని టెర్రరిస్టు
మనుషులంతా ఒక్కటన్న
మానవత్వపు రుచి మరిగినట్టు ...

పనికిరాని మాటలన్నీ
పక్కనెట్టి పాలకులు
ప్రజల మనసునెరిగి కరిగి
పరిపాలన సాగించినట్టు..

ప్రజలు స్వార్ధం మరచినట్టు..
పడతి ప్రగతికి చేరినట్టు..
లోకమంతా వెలిగినట్టు..
సుఖశాంతులు వర్ధిల్లినట్టు..

అన్నీ కలలే..అంతటా కలలే..

కానీ..
మనిషి మనసుతో చేయి కలిపి
సాటిమనిషిని ప్రేమిస్తే..స్వార్ధం లేకుండా కష్టిస్తే...
ఆశలన్నీ నెరవేరి అభివృద్ధి ఫలాలై దరిచేరగా
అన్నీ నవ్వులే..అంతటా సంతోషమే ..


(నిద్ర రాని ఓ శనివారం రాత్రి...నవీన్ కొమ్మినేని)

Monday, March 15, 2010

తపన..

ఆర్కుట్ లో "five things u can't live without" అన్న ఫీల్డ్ చూసినపుడ్డు రాసినదిది
-------------------------------------------------------
ఉన్నఫళంగా చెప్పడం కష్టమే గాని..
ఒక్కోసారి సంగీతం లేకపోతే ఏమైపోతానో అనిపిస్తుంది ...
ఇంకోసారి అమ్మ నాన్న లేకపోతే బతగ్గలనా అనిపిస్తుంది..
మరోసారి, బతకడానికి కూడు..గూడు.. నీరు ఉంటె చాలు కదా అనిపిస్తుంది..
అప్పుడప్పుడూ ఏమనిపిస్తుందో తెలుసా... స్నేహితులు లేకపోతే ఎంత బతుకు బతికినా వృధాయే కదా అని..
కానీ.. ఎప్పుడూ నాతోనే ఉండాలనుకునేది, అది లేకపోతే నేను పుట్టింది కేవలం భూమాత భారం పెంచడానికే అనిపించేది, ..... తపన
అవును..
ఉన్నత వ్యక్తిత్వం సంపాదించాలనే తపన ...
నా వల్ల కొద్దిమందైనా సంతోషంగా మారాలనే తపన ...
అమ్మ ప్రేమ కోసం తపన..
ఆర్తి తీర్చాలన్నతపన..
ఎంతో నేర్చుకోవాలన్న తపన..
ఎందరికో పంచాలన్న తపన..
కష్టాలను జయించాలన్న తపన ...
ఇష్టాలను నేరవేర్చుకోవాలన్న తపన...
అందని ఎత్తులు ఆశించే తపన..
అనుక్షణం ఆశయ సాధన కోసం తపన....
విజయగాధల స్ఫూర్తి పొందే తపన..
చేతికందిన విజయపు స్ఫూర్తి పంచే తపన..
పడిన కెరటం పైపైకి లేచే తపన..
పగటి కలల్ని పటాపంచలు చేసే తపన..
ఆత్మవిశ్వాసపు అనంత హద్దులు సృష్టించాలనే తపన..
ఆత్మశోధన అవసరాన్ని చెప్పాలనే తపన..
ఎద ఎదనూ తట్టి లేపాలన్న తపన..
ఎదిగిన చెట్టు ఒదిగిన వైనం కోసం తపన..
మానవత్వపు విలువలతో మసలాలన్న తపన..
మనీషిగా మారాలన్న తపన..
ఇదే.. ఈ తపనే నన్ను బ్రతికిస్తోందనుకుంటా
తపనే లేకపోతే నేను బతకలేననుకుంటా..