Thursday, November 14, 2013

మిథునం చూశారా !

మిథునం చూశారా !

నేనయితే మూడుసార్లు 
లక్ష్మికోసం ఒకసారి 
బాలూకోసం ఒకసారి 
భరణికొసమ్ ఇంకోసారి 

ఆదిదంపతులు 
అభిమానించిన మిథునం 
కాదు కాదు 
అసూయపడిన మిథునం 

అప్పదాసు బుచ్చిలక్ష్మిల 
మిథునం 
అవునవునది 
అచ్చతెలుగు మిథునం 

సరసాల నవరసాల 
మిథునం 
అదే అదే 
ముచ్చటైన  మిథునం 

అన్నట్టు, మిథునం చూశారా ?

నేనయితే మూడుసార్లు 
శ్రీరమణ కోసం ఒకసారి 
జేసుదాసు కోసం రెండోసారి 
జొన్నవిత్తుల కోసం మూడోసారి 

ఇంతచెప్పాకా చూల్లేదంటారా 
ఆశ్చర్యంగా ఉందే!



Wednesday, November 13, 2013

!! ఎన్నాళ్ళిలా!!

మిత్రమా!

ఎన్నాళ్ళిలా ఏడుస్తావురా?

ప్రేమించావూ సరే,
ఫలితమనేదేముంది?

నవ్వుల ముసుగేసున్న కన్నీళ్ళతో నీ
పగళ్ళు పగిలిపోతున్నాయి

నిదుర నిర్దయగా వెలివేసిన నీ
రాత్రులు చుక్కలుగా రాలిపోతున్నాయి

మిత్రమా!

ఎన్నాళ్ళిలా ఏడుస్తావురా?

వలచావూ సరే,
ఓటమనేదెక్కడుంది?

నిశీధి నీడన కరిగిపోయిన
నిన్నల్లోనే నిలిచిపోతావా..

నీళ్ళలా జారిపోనీక
ఙ్ఞాపకాలకు దోసిలి పడతావా..

ఆలోచించు
ఉలితగలని శిల
శిల్పమయిందేమో గుర్తించు..

ఆలోచించు
వెక్కిరించిన విధికి
వెరవక దాని మెడలు వంచు

అంతేగానీ, మిత్రమా!

ఎన్నాళ్ళిలా ఏడుస్తావురా?

Tuesday, November 12, 2013

!! ఉత్తినే సరదాకి !!

రోజూ జరిగే సూర్యోదయమే
ఈరోజు మాత్రం
కొత్తగా..
ప్రశాంతంగా..

రోజూ జరిగే సూర్యాస్తమయమే
ఈరోజు మాత్రం
నిదానంగా..
నిమ్మళంగా..

విషయమేమిటంటే,

పెళ్ళాం ఊరెళ్ళింది..:p

నవీన్ కొమ్మినేని !! 12/11/2013 !!

Friday, November 8, 2013

కష్టాలకు తోడు...

కష్టాలా? ఒంటరిగానా? ఎప్పుడూ రావే...

ఎదురొడ్డే తత్వమున్నవాళ్ళకి
పాఠాలతో కలిసొస్తాయి

ఏడ్చే తత్వమున్నవాళ్ళకి
కన్నీళ్ళతో కలిసొస్తాయి

తెలివైనవాడయితే కష్టం వెంటే
సుఖమొస్తుందంటాడు

తెలివిలేనివాడయితే
ఇంకోకష్టం వస్తుందంటాడు

మొత్తానికైతే కష్టాలు ఒంటరిగా రావు...

(కష్టాలు ఒంటరిగా వస్తాయా అన్న మిత్రుని ప్రశ్నకు సమాధానంగా రాసింది...)

Wednesday, November 6, 2013

కలా - కన్నీళ్ళు

సాఫీగా సాగుతున్న కల
సగంలోనే మెలకువొచ్చింది
కళ్ళుతెరచి చూద్దునుగదా
కుప్పలు తెప్పలుగా
ముక్కలు ముక్కలుగా
పడున్నాయి..నిజాలు

ఆశ చావకనో, నిజాన్ని భరించలేకనో
మళ్ళీ కళ్ళు మూసుకున్నాను..
ఊహూ లాభం లేదు..
సమయం మించిపోయింది..
కలచెదరి పశ్చాత్తాపం మిగిలింది
కన్నీళ్ళుగా..