Thursday, November 26, 2015

!! నిత్యసత్యం !!

అవును కదా,
ఎంత నిస్సహాయతను కొనితెచ్చుకుంటున్నామో!

కంటిచూపు, చేతిస్పర్శ, మనసూ, మాటలూ నెరపాల్సిన మానవసంబంధాల్ని ఏ ఆధునిక ఉపకరణాలకో ఏ అవ్యక్త అనుభూతులకో అప్పగించేసి ఎవరికివారిమై ఏకవ్యక్తి సమూహాల్ని నిర్మించుకుంటున్నాం.

ఖాళీ లేదు. ఏకాంతం లేదు. కలల్లేవు. కరుణ లేదు. కవిత్వం లేదు.

ఉన్నదల్లా గమ్యం తెలియని ఉరుకులాట.గెలుపోటములు మాత్రమే మిగిలిన ఆట. పెనుగులాట. ముసుగులో గుద్దులాట. దేహసరిహద్దుల్లోనే కనుమరుగవుతోన్న మానవతాపాట.

ఎన్నాళ్లయిందో ఎదుటివ్యక్తి కళ్లలోకి చూసి ఒక్క చిర్నవ్వు నవ్వి. ఎన్నాళ్లయిందో ఒక తడిచెంపమీద చేతులేసి సేదదీర్చి. ఎన్నాళ్లయిందో ఒక పాటలోని గమకానికి పరవశమొంది. ఎన్నాళ్లయిందో పసిబుగ్గల పాపాయిని పైకెగరేసి పట్టుకుని. ఎన్నాళ్లయిందో... కిటికీపక్కన గువ్వపిట్టకు గుప్పెడు గింజల్ని గుమ్మరించి.

ఏ అగ్నిపర్వతపు ఎద బద్దలైనపుడు ఎగిరిపోయిందో మనలోని సున్నితత్వం. మనలోని మృదులత్వం. మనలోని మనిషితనం. ఏ ఉప్పెన ఎత్తుకెళ్లిందో ఏ భూకంపం పెకిలించివేసిందో ఏ మహాకుంభవృష్టి తుడిచేసిపోయిందో..

కంటిచూపుని కాజేసిన కాళరాత్రి రంగు తెలియదు. చేతిస్పర్శను మింగేసిన చేదు క్షణాలు గుర్తుకురావు. మనసెప్పుడు మాయమయిందో మాటలెప్పుడు మౌనసంద్రంలో మునిగిపోయాయో లెక్కతెలియని అమాయకత్వం. లెక్కేదొరకని అభద్రత.

కన్నుతెరిచింది మొదలు కాళ్లకొకటే పని. ఎన్ని వలల్లో చిక్కుకుంటుందో ఎన్ని వలయాల్లో ఇరుక్కుపోతుందో ఏకాంతం ఎదుటకు రాదు. కంటినిండా నిద్ర కరవై కలవరింతల కలలు పండకుండానే రాలిపోతాయి. కరుణసాగరంలో పొంగుకొచ్చే అలలు తీరం చేరకుండానే గడ్డకట్టుకుపోతాయి.

నీకూ తెలియదు. నాకూ తెలియదు. కాలమెలా కదులుతోందో ఎక్కడెలా ఆగుతోందో మళ్లీ ఏ మలుపులో మొదలవుతోందో. ఏ గాయాలను మాన్పుతోందో ఏ చరిత్రపుటలకి అక్షరాలిస్తోందో ఏ మూలలో ఎవర్ని ఎందర్ని దాచేసిపోతోందో.

నేస్తమా! ఇలాగే నడుస్తూ పోదామా? శవపేటికకు ఒక్కో పుల్లను పేర్చుకుంటూ?


(అఫ్సర్ మొహమ్మద్ గారి కవితొకటి చదివినపుడు మెదిలిన భావం)

Wednesday, November 25, 2015

!! నగ్నహృదయం !!

రెండురెక్కలు మొలిపించుకుని దిక్కులకెదురేగాలి
కొంత ధూళిని కప్పుకుని కొన్ని మెరుపుల్ని పూసుకుని
ఎప్పటికీ రాలని నక్షత్రాన్నై నిలవాలి

మట్టిరేణువులకు మనసివ్వాలి
కాస్తంత చేతులకి కాస్తంత కాళ్లకి ఇంకాస్తంత హృదయానికీ రాసుకుని
నేనొక మట్టిమనిషినవ్వాలి

కమిలిన మనసుదేహంపై తడితడిగా తగిలే
నిస్స్వార్థ పిల్లగాలుల్ని ప్రేమించాలి
వెన్నెల్లో దూరి వేణువులో చేరి వేదనలో జారి
వాటితో కలిసి పాడాలి నేనే వొక పాటనవ్వాలి

ఆకాశం అడుగుల చప్పుడుమోస్తూ నేలకు రాలే
చినుకుల భాష నేర్చుకోవాలి
ఒక్కో అక్షరాన్ని పొదువుకుని ఒక్కో సందేశాన్నీ నింపుకుని
సెలయేటి కావ్యమై
నేనొక మహాసముద్రమవ్వాలి

పక్షిలాగా
పచ్చనిమట్టిలాగా
పిల్లగాలిలాగా
పచ్చిచినుకుల్లాగా
నేనొక నగ్నహృదయాన్ని నిర్మించుకోవాలి.

Sunday, November 15, 2015

!! పరిణామం !!

పక్షులు స్వేచ్చగా ఎగరడం నేర్చుకున్నాయి
మొక్కలు పువ్వులు పూయడం నేర్చుకున్నాయి
చేపలు సముద్రం ఈదడం నేర్చుకున్నాయి
అయిదులక్షలేండ్లు అడుగులేసీ
మనిషి
నేటికి నేర్వగలిగిందొక నెత్తుటిభాష

అంతరిక్షంలో అడుగుపెడుతూ
అంతరాల అగాథాల్లోకి జారిపడుతూ
ద్వేషాన్నీ దాటలేని దుస్థితి
ప్రేమను పంచలేని దైన్యం

ప్చ్!!
మనిషి
సుఖంవైపు కాక
స్వచ్ఛతవైపు పరిణమించాల్సింది

Tuesday, November 3, 2015

!! అంతే... !!

ఎంతగింజుకున్నా
ఒక్క గ్రీష్మజ్ఞాపకమూ
స్మృతిపథంలోంచి పక్కకిపోదు

ఎంత పెనుగులాడినా
ఒక్క చీకటిరహస్యమూ
ఉచ్ఛ్వాసనిశ్వాసాలను వీడిపోదు

ఆలోచనల వధ్యశిలపైనుంచి
ఎగిరిపడే శిరస్సుల లెక్కతేలదు
అంతఃఘర్షణల అడవిదారిలో
అసలెంతకూ గమ్యం దొరకదు

అనువదిద్దామంటే
అక్షరాలుగా మార్చి ప్రవహింపజేద్దామంటే

కల్లోలకడలి దాటి
ఒక్క అక్షరమూ ఒడ్డుకురాదు
మస్తిష్క మేఘావళి కరిగి
ఒక్క చినుకూ కవిత కాదు

శాంతిదొరికేదల్లా,
భోరున కురిసే వానను చూసినపుడూ
వానలో తడిసే దూరపు కొండను కలిసినపుడూ
అంతే!