Monday, September 22, 2014

!! ఐదు ముఖాలు !!

అది
ఆదిమధ్యాంతరహిత మంచుకొండని తెలిసీ
కరుగుతున్న ప్రతిక్షణాన్నీ
పదిలపరచాలని చూస్తున్నాడొకడు

ప్రచండమైన పడమటి వెలుగుల్ని చూస్తూకూడా
రేపటి ప్రశాంత ఉదయాన్ని స్వప్నిస్తున్నాడొకడు

హృద్యంతరాలలోంచి పొంగిన ఒకనది
సముద్రమయ్యాక కూడా
తిరిగి తనలోకి ప్రవహిస్తుందని వేచిచూస్తున్నాడొకడు

ఆనందరాగం అనంతవాయువుల్లో లీనమయ్యాక కూడా
వేణువును వెర్రిగా తడుముతున్నాడొకడు

నిజంలాంటి నిప్పు నిలువునా కాలుస్తున్నా కూడా
ఒక ప్రవాహంలోకి తొంగిచూస్తూ
తన ఐదవముఖానికి రంగులేస్తున్నాడొకడు

Tuesday, September 16, 2014

!! పగిలిన అద్దం !!

పగిలిన అద్దం ఎక్కడిదంటే
పడదోసిన పాపం ఎవ్వరిదన్నాడు

పగిలిన అద్దం ఎవ్వరిదంటే
ప్రశ్నలు మాత్రం ఎక్కడివన్నాడు

పగిలిన అద్దం ఏం చెప్పిందంటే
పరుగుల శబ్దం విన్లేదా అన్నాడు

పగిలిన అద్దం ఏం చూపిందంటే
పొదిగిన కలలను కన్లేదా అన్నాడు

పగిలిన అద్దం ఏం చేస్తోందంటే
పొగిలి పొగిలి నవ్వుతోందన్నాడు

ఎవడువీడు?
ఏమైంది వీడికి?

Thursday, September 11, 2014

!! వేచి ఉండండి !!

సముద్రాలు పాతవే
కొత్త తీరాలు నిర్మిస్తున్నాను

చీకట్లు పాతవే
కొత్త వెలుగులు పూయిస్తున్నాను

శోకతప్త గ్రీష్మాలూ పాతవే
కొత్త వసంతాలు సృష్టిస్తున్నాను

వేచి ఉండండి!
మీదాకా వస్తాను
మీకూ కొన్ని రంగులు పూస్తాను..