Thursday, March 22, 2018

!! ప్రయాణం !!

నిన్నట్లాగే
ఒక అపరిచిత దారిలో నడుస్తూ వచ్చాను

పగిలిన పల్లేరుకాయలు గుచ్చుకున్నా
కొండల అంచులు సంగీతం వినిపించాయి
కొంతదూరం హెచ్చుస్థాయిలో
మరికొంత దూరం మంద్రస్థాయిలో..

ఇవాళ్టిలాగే రేపూ
ఒక అపరిచిత దారిలో ప్రయాణమని తెలుసు
అయితే,
రేపొక మోదుగుచెట్టు కనిపించవచ్చని ఊహిస్తున్నాను.

Sunday, December 11, 2016

!! 31 - రాత్రి !!

రేగినధూళి అంతా
సద్దుమణిగిపోతోంది
బిగ్గరగా వినిపించిన అరుణగానం
కిరణాలు కుచించుకుపోయి
మంద్రస్థాయిలో మూల్గుతోంది
స్వేచ్ఛను నర్తించిన పక్షులన్నీ
గూళ్లలో వెచ్చగా ఒదుగుతున్నాయి
నేనైతే
అంధకారాన్ని ప్రేమించలేను
చిందిన ఆకుపచ్చని నెత్తుటితోనే
దీపాన్ని వెలిగించుకుంటాను
ఒక్క చీకటిరాత్రినైనా వెలివేసి
వెలుగులకు ఎదురేగుతాను
నవీన్ కుమార్!! 31.10.16

!! నా ఉగాది !!

నిద్రలేస్తూనే చురచురమంటూ
పన్లోకొస్తున్న సూర్యుడు
రాత్రి తనలోకి ఒంపిన తడిని
అయిష్టంగా రాల్చేసుకుంటున్న గాలి
ఒంపుల రాదారీ
వంకల చిర్నవ్వూ
లేచివుళ్ల చీరలో మెరుస్తూ పల్లె
ఒంటిమిట్ట
మిట్టకింద మలుపులో దోస్త్‌గాడి ఇల్లు
రాతిగోడల్లోపల నిలువెత్తు వెన్నముద్దలు తిరుగాడే ఇల్లు
ఇంకా,
మొదటిసారి మట్టివాసన వేస్తున్న కాఫీ.
ఇదీ నా ఉగాది.

!! నిరీక్షణ !!

ఏం తప్పు చేసిందో ఆకాశం
చందమామ వెళ్లిపోయింది
నిజం తెలిసిన నక్షత్రాలు
మిణుకుమనడం తప్ప ఏమీ చేయలేవు
మేఘాలకూ నిద్రరానట్టుంది..
ఊరికే అలా గాలికి తిరుగుతున్నాయి
ఎవరైనా జోలపాడితే బాగుణ్ణు

!! ప్రేమసందేశం !!

సరే,
జరిగిందేదో జరిగిపోయింది

పొడుస్తున్న పొద్దులోంచి
కొంచెం కాంతి పొంది
విచ్చుకునే మొగ్గలోంచి
కొన్ని రంగుల్ని రాసుకుని
వీలైతే, ఆ పసివాడి బుగ్గల్లోంచి
కాస్త పసరు పూసుకొని
సాగిపొమ్మని చెప్పు
నీ హృదయానికి...

ఓ ప్రేమికుడా
నీ అడుగుల నేపథ్యసంగీతం
ప్రపంచగాయాల్ని మాన్పగలదు

Friday, July 8, 2016

!! ఒంటరి సాయంత్రం !!

::1::

పడమటిదిక్కున
సూర్యకిరణాలు ఒక్కొక్కటిగా ఇంకిపోతున్నాయి

లేతచీకటిని గిల్లేస్తూ
మిణుగురులు ఒక్కొక్కటే ఎగిరొస్తున్నాయి

చెవిలో ఒక ప్రేమికుడు
తనగుండె పగిలిన శబ్దాన్ని వయోలిన్ పై వినిపిస్తున్నాడు

ఎప్పట్లానే
ఈ గాలితెమ్మెరలు
నీ పరిమళాన్ని నా ఒంటికి పూసి పోతున్నాయి

::2::

కీచురాయి శబ్దము
ఆ శబ్దానికి స్తంభించిన గాలీ

రెండు ఆకులురాలిన చెట్లు
ఆ చెట్లమధ్య ఖాళీదూరాన్ని ఆక్రమించిన చీకటీ

ఎక్కడో
అక్కడెక్కడో మూలలో
శూన్యంలోకి రాలిపోతూన్న నక్షత్రం వేదన తప్ప
ఇప్పుడిక్కడ ఏమీలేదు

గాయం మానేందుకు
నీ స్పర్శలాంటి ఔషధమేదీ ఇప్పుడిక్కడ లేదు

::3::

కళ్లను ఛెళ్ళున తాకిన కాంతిపుంజపు హృదయాల నిర్దయను కొలతదీస్తూ నీడల్లోకి నడిచెళ్లిపోయిన చీకటి సాక్షిగా దేహమలా ఒంటరిగా ఆకలిమహార్ణవంలోకి అడుగులు వేయడం ఆరంభించిన మరుక్షణమే దిగంతాలనుంచి వినవచ్చిన వేనవేల భయంకర శబ్దాలకు సమాధానమివ్వలేకా వాటిని శాంతపర్చనూలేక విలవిల్లాడిన మనసునెలా ఓదార్చాలో తెలియని కాలం గుండెలోని శూన్యాన్ని నింపడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోన్న సూర్యరశ్మి రెక్కల్ని ఫెళఫెళా విరుస్తూ విరుచుకుపడ్డ గాలిని తన మృదుత్వంతో లాలిత్యంతో చల్లబరుస్తోన్న ఆ చూపులోని తడి గుచ్చుకుని ఈ సాయంత్రమిలా నల్లగా నిశ్శబ్దంగా రోదిస్తోంది.

!!HolyColours!!

ది బ్లాక్
ది బ్రౌన్
ది యెల్లో
ది రెడ్
ది వైట్

నిజమే!!
రంగుల్లోని తేడాల్ని
మనిషి సెలిబ్రేట్ చేసుకున్నంతగా మరేజీవీ చేసుకోదు.