Wednesday, September 25, 2013

ఆశావాదము

శ్రీ అడపా రామకృష్ణారావు గారి "సోక్రటీసు" రేడియో నాటకం చదివాను... స్వార్థపరులు, దుర్మార్గుల గురించి ఆవేదన చెందుతున్న తన శిష్యునితో సోక్రటీసు చెప్పే ఈ క్రింది మాటలు బాగున్నాయనిపించింది.
ఇంతటి ఆశావాదం అలవరచుకోవడం, అందుకు తగ్గట్టు జీవించడం సాధ్యమా అనిపించింది.

" ఈ చెట్టు ఒక చిన్న కొండమీద ఉంది. ఈ కొండ ఏథెన్స్ కు దగ్గరలో ఉంది. ఏథెన్స్ గ్రీసు దేశంలో ఒక మూల ఉంది. గ్రీసు దేశం ఈ విశాల ప్రపంచంలో ఒక చిన్న చుక్క. ఈ ప్రపంచం విశ్వంలో అంతకన్నా చిన్నచుక్క."
...
"ఇక కాలం సంగతి చూద్దాం. అంతులేని కాలప్రవాహంలో మానవ జీవితకాలం ఎంత స్వల్పమో ఆలోచించు. సృష్టిలో మొదట మానవునికి జంతువులకూ భేదం లేదు. క్రమంగా మానవజాతిలో ఎలాంటి వికాసం కలిగిందో చూడు. మానవజాతిలో ఎందరు కవులు ఎందరు శిల్పులు మహానుభావులు జన్మించారు. ఈ కాలం లో మానవజాతికి వికాసం కలగలేదంటావా?"

"మానవజాతి ఇంకా బాల్యదశలోనే ఉందని తెలుసుకో. తరాలతో పాటు మనిషిలో విజాఞనం క్రమంగా వికసించడం లేదూ? ఒక నాటికి మనుషులు తమ లోపాలన్నింటినీ జయించి, హింస, వంచన, స్వార్థం అన్నీ విడిచి ప్రేమభావంతో జీవిస్తారేమో? మనమంతా మరణించిన తరువాత ఒక నాటికి అలాంటి కాలం వస్తుందేమో? "

Monday, September 23, 2013

నువులేక సగమైన నేను

కులముంది మతముంది
మనసేగ మాయం..

ఏనాడు ముగియాలి
బరువైన ప్రాణం..

నువులేని నేనీక్షణం
నీడై కరిగానులే అనుక్షణం....

నీ రూపే కొలువున్న కనులింటిలో
కన్నీటిసంద్రాలే కలలెక్కడో..

నిత్యాలు సత్యాలు మన ప్రేమలూ
వికసించు మరుజన్మలో..