Saturday, January 10, 2015

!! ఇల్లు కావాలి !!

ఇల్లొకటి కావాలి

ఏఊరివారినైనా
ఏకాలపు వారినైనా
అడ్డగించకుండా అనుమతించేందుకు
తలుపుల్లేని ద్వారాలుండాలి

ఏరకపు గాలైనా ధారాళంగా లోపలికొచ్చేందుకు
ఉదయాస్తమాల వెలుగుచీకట్లను సమంగా నింపేందుకు
తెరలు లేని కిటికీలుండాలి

నావాళ్లు నానా నమ్మకాలు గలవాళ్లు
ఏనమ్మకపు సువాసనలైనా
నిర్భయంగా తిరుగాడేందుకు
విశాలమైన గదులుండాలి

అలసినపుడొ
ఆవేదన వరించినపుడో
సేదదీరడానికి ఒక చెట్టుండాలి
చెట్టు చుట్టూ సంగీతం పలుకుతుండాలి

పూబాలలు
నాపిల్లలు
అందంగా నిండుగా విరబూయడానికి
సారవంతమైన పెరడొకటుండాలి

నాకొక ఇల్లుకావాలి
నా మనసులాంటి ఇల్లు

కనిపించినపుడల్లా
చిరునవ్వు కరచాలనం చేస్తాను
నెలకో వారానికో రోజూనో
ఒక ఆత్మీయ ఆలింగనాన్ని అద్దెగా ఇస్తాను

నాకొక ఇల్లుకావాలి
అచ్చంగా నా మనసులాంటి ఇల్లు


నవీన్ కుమార్ !! 10/01/2015

Sunday, January 4, 2015

!! రాత్రి !!

పడమటి అంచు
అందంగా రంగులు మారుతుంటుంది
అదృశ్యశక్తులేవో
నింగిపైకి నక్షత్రాల వర్షం కురిపిస్తాయి
పిల్లకాలువలో కాగితప్పడవలా
చందమామ తేలుతూ వస్తాడు
నిశ్శబ్దంగా రాత్రి నిద్రలేస్తుంది

శీతాకాలపు సమీరంలా
పాదాలను తాకి
నిగూఢ సందేశాలు దాగిన పరిమళంలా
దేహాన్ని చుట్టి
నిస్సారపు నీడలు దూరంచేసి
ఆలోచన అడుగులు నెమ్మదిచేసీ
మనసును మరోలోకంలోకి తీసుకెళ్తుంది రాత్రి

కలలకౌగిట బంధించి
వెన్నెలవీధుల తిప్పించి
గుప్పిట గుట్టుగాదాచిన మధురక్షణాలను
గమ్మత్తుగా విప్పుతుంది రాత్రి

శ్రుతితప్పని ఈ లాలిపాటకు
నిదురించని దేహమూ లేదు పులకించని ప్రాణమూలేదు
సుతిమెత్తని ఈ రాత్రిస్పర్శకు
కదలని హృదయమూ లేదు కరగని శోకమూలేదు

Saturday, January 3, 2015

!! ప్రకృతహృదయం !!

ఆకాశంలాంటి హృదయం నాది
మెరుపులగాయాలు కోతపెడితే
కన్నీళ్లను కురిసి
కరిగిన మబ్బులమాటున
నిర్మలత్వాన్ని వెతుక్కుంటుంది

నేలలాంటి హృదయం నాది
దుఃఖాగ్నిపర్వతాలు బద్దలైతే
లావాలా పెల్లుబికి
ప్రవహించిన దారులంతా
సారాన్ని తిరిగి పొందుతుంది

అచ్చంగా రాత్రిలాంటి హృదయం నాది
చీకటిబాణాలు సూటిగా తగిలితే
విలవిలలాడీ
నక్షత్రాల నీడల్లో
వెలుగుకోసం నిరీక్షిస్తుంది

ఎందుకంటే
నా హృదయానికి మనిషితనమెక్కువ
ఎందుకంటే
నా హృదయానికి ప్రకృతితో సారూప్యమెక్కువ

నవీన్ కుమార్ !! 03/01/2015