Saturday, June 21, 2014

!! నేను నా ఆకాశం !!


ఆకాశం నా ఆత్మీయ నేస్తం
మౌనంగా
ఎన్ని సంగతులు మాటాడుకుంటామో!
ఎన్నెన్ని కాలాలు ఒకటిగా చూశామో!
నేనంటే ఎంత ప్రేమనుకున్నావ్?

మనసేం బాలేదన్నాననుకో
మేఘాలు సృష్టించీ
ముత్యాలు చిలకరించీ
ముద్ద ముద్ద చేసేస్తుంది

మౌనంగా ఉన్నాననుకో
మెరుపులు మెరిపించీ
ఉరుములు పలికించీ
ఏమైందంటూ ప్రశ్నిస్తుంది

ఏం కాలేదని కళ్లికిలిస్తూ నే చెబితేనేమో
నీలంగా నవ్వేస్తుంది

అటుపోయీ ఇటుపోయీ
అదిచేసీ ఇదిచేసీ
అలసిపోయీ నేనొస్తే
చందమామను పిలిపించి
చుక్కల్ని రప్పించి ఎదపై
వెన్నెల కురిపిస్తుంది

ముభావంగా ఉండి నేనిటుతిరిగి పడుకుంటే
చల్లగాలితో చక్కిలిగింతలు పెట్టిమరీ తనవైపు తిప్పుకుంటుంది
నల్లగా నాతోపాటే నిదురపోయి
నాకంటే ముందే తెల్లగా మేలుకుంటుంది
సంతోషం పంచుకోవాలని చేతులెత్తి నే చిందులేస్తే
చిరుగాలిలా మారి నన్ను చుట్టేసుకుంటుంది

ఒక్కోసారి తనకూ బాధేస్తుంది పాపం!
భోరున విలపిస్తుంది
తననెవరో కాలుస్తున్నట్టూ
తన వలువల్నెవరో విడదీస్తున్నట్టూ
భగ్గున మండిపోతుంది ఆకాశం
పాపం ఆకాశం..
ఎవ్వరితోనూ చెప్పుకోదు..నాతో మాత్రమే
నేనయితే వింటాను కదా!

ఏం చేయగలను?
తనబాధను కాస్తయినా పంచుకుందామని
నిండా తడుస్తాను
నీరైపోతాను..కన్నీరైపోతాను
నేనేడ్వడం చూడలేక
కాసేపటికి శాంతిస్తుంది ఆకాశం
నేనుమాత్రం,
నాలో నిండిన తన దుఃఖాన్ని
బొట్లు బొట్లుగా పిండేస్తాను

ఆకాశానికి దెయ్యాలంటే భయం
నలువైపుల్నుంచీ ఈ మధ్య
దెయ్యాలు చుట్టుముడుతున్నాయి
నలిపేస్తున్నాయి.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి
వయొలిన్ పై విషాదగీతంలా
వినిపిస్తుంది ఆకాశం ఆర్తనాదం
తనకెంత బాధవుతుందనీ! నాకెంత బాధవుతున్నదనీ!
ఒంట్లో ఒకమూలకం ఒంటరిగా పోరాడుతున్నభావన..

నన్నూ తనలో కలిపేసుకోమనీ
నేనూ తనకు సాయపడతాననీ
ఎన్నోసార్లు చెప్పాను..
కరుణామయి కదూ నా ఆకాశం
కాదంది!

కనీసం తన కన్నీళ్లయినా తుడుద్దామంటే
నా చేతులేమో చాలడంలేదు
అందుకే
రెండు మొక్కల్ని పెంచుతున్నాను
అవి ఏనాటికైనా ఆకాశమంత ఎత్తుకు ఎదిగి
నాచేతుల్తో తన చెమ్మను తుడుస్తాయని ఆశ
రోజూ నీరుపోసేటపుడు చెమర్చే నా కళ్ల సాక్షిగా
నా ఆకాశాన్ని ఓదార్చుతాయని ఆశ!

Friday, June 20, 2014

నే రాసిందే

పల్లవి:

రేవెన్నెల నాకన్నుల పూసిన కలువ
మెలికల కొలువా మరి మెరుపుల నెలవా
నువేనా ఆ చెలువ వన్నెల కలవా నువేనా ఆ చెలువ

చరణం:

కలహంస నడకల
కలకంఠి పలుకుల
రాగాల హాసాల రాజీవ నేత్రాల
చిత్తరువును చిత్తరువుగ చెక్కిన వెన్నెల రేయి
చిత్తరువును చిత్తరువుగ చెక్కిన వెన్నెల రేయి
గువ్వగ చేరిన వలపు గుండెను తాకిన పిలుపు
నువేనా ఆ తలపు ఊహల గెలుపు నువేనా ఆ తలపు

చరణం:

మదిలో రాగమై మౌనవీణ నాదమై
సరిగమ సారమై స్వరమై వినిపించి శ్రుతులే సవరించి
ఎదసడి తాళమై ఎదలోతున గానమై
ఎదసడి తాళమై ఎదలోతున గానమై
పాటగ మారిన పిలుపు పువ్వుగ విరిసిన వలపు
నువేనా ఆ మెరుపు తీయని సలుపు నువేనా ఆ మెరుపు

!!ఆత్మీయ అక్షరం!!

గువ్వంతగుండె ఎగరలేక ఎగాదిగా అయినపుడూ
పిసరంత ప్రేమలేకా బతుకుపాట తడబడినపుడూ
పెన్నూ పుస్తకమందుకుంటాను

అలలెత్తే అశ్రువులు 
అక్షరాలుగా ఒదిగి నన్నల్లుకుంటాయి

పెనువిషాదం పలకరించినపుడూ
మరలిరాని నేస్తం మళ్లీ గురుతొచ్చినపుడూ
పెన్నూ పుస్తకమందుకుంటాను

కలం నుంచీ కరిగి కన్నీళ్ళు
కళ్లల్లో కాంతిరేఖలై మెరుస్తాయి

అంతరంగంతో అనేక యుద్ధాల్లో ఓడినపుడూ
నమ్మకాలు నిలువ నీడలేక రాలినపుడూ
పెన్నూపుస్తకమందుకుంటాను

కాగితంపై చింది రుధిరాక్షరాలు
రేపటికి మరోనన్ను ఆవిష్కరిస్తాయి