Sunday, January 31, 2016

!! నిన్ను కోల్పోయిన శోకంలో !!

ఎంతటి మేధ
ఎంతటి ఆశయం
ఎంతటి కరుణ
నీ మనసుదెంతటి శక్తి
ఆకాశంలోకి అలా విసిరేసుకున్నావేం రోహిత్?
నీదైన ఒక రోదసినే నిర్మించుకోగల వాడివి
ఈ నికృష్ట ప్రపంచాన్ని చూసి జడిసావేం రోహిత్?

మరణంలో సుఖంగా ఉంటానన్నావు
మరి, ఇన్ని గుండెల శోకానికి జవాబేది?
నీ మరణాన్ని జీర్ణించుకోలేక కీర్తించనూ లేక
మధనపడే మనసులకు శాంతి ఏది?

నాకు తెలుసు
నీ లేఖలోని అక్షరాలు క్షణికావేశంలోనివి కావని
అనాదిగా ఆత్మనలిగినప్పుడల్లా ఒక్కోటిగా పుట్టుకొచ్చినవనీ!
నాకు తెలుసు
ఆ ఉరితాడులోని పోగులన్నీ పిరికితనంలో తయారవలేదని
విషవర్ణసంస్కృతిలో వేలయేళ్లుగా పేనబడినవనీ!
అయినా, నువ్వే చెప్పు.. మరణం పరిష్కారమా?

నిన్నుపొందిన కాంతితో
నక్షత్రాలు విర్రవీగుతుండొచ్చుగాక
ఒక్కసారి ఇటుచూడు..
నిన్ను కోల్పోయిన శోకంలో
వేల ఉక్కుపిడికిళ్లు ఒక్కటవుతున్నాయి
నువ్వు శరణన్న మరణం ఇంకొకరికి వరం కాకూడదని..
తిరిగి రాగలవా?

!! ప్రేమమ్ !!

కనుపాపల్ని అటూఇటూ కదిలిస్తూ
కోటిదీపాల కాంతితో
గుండెలోకి సూటిగా నువు విసిరే చూపుకాక
ప్రేమంటే మరేమిటి?
ఎదలో ఓ పూదోటను వికసింపజేసి
ఆ పరిమళాన్నంతా
ఆత్మచుట్టూ పరిచే నీ చిరునవ్వు కాక
ప్రేమంటే మరేమిటి?
చలికాలం కలలూరేపూట
చెంపలకిందకు చేతులుచేర్చి
నుదురును ముద్దాడే నీ పెదాలస్పర్శ కాక
ప్రేమంటే మరేమిటి?
చూపులు జతకలిసి, చిర్నవ్వులు శృతికలిపి, వెచ్చని స్పర్శల తాళంలో నువ్వూనేనూ సంగీతమైనప్పటి క్షణాలుకాక
ప్రేమంటే మరింకేమిటి?
(to 'Malar', who expressed her love through eyes, smile and a warm touch.. in 'Premam' )

Monday, January 4, 2016

!! Human Geography !!

మొదలు తుదలూ తెలీకుండా
మనుషులు గీసుకున్న
అంతరాల అడ్డుగీతలు అక్షాంశాలు
అన్నిటికన్నా పెద్ద అక్షాంశం - ఆకలిభూమధ్యరేఖ

కలిసీ కలవక
ఏ కోణంలోనైనా
భూమిని రెండు వర్గాలుగా చీల్చే
నమ్మకాల నిలువుగీతలు రేఖాంశాలు

దీపంచూట్టూనే తిరుగుతూ
గుప్పెడు వెలుగును గుంజుకోలేక గాఢాంధకారంలోకి జారిపోతున్న
గుడ్డిపురుగు భూమి

సూర్యుడెవరో తెలుసా?
విశ్వమానవ దేహంపై
పూటకొక్కచోట పుట్టుకొస్తోన్న నెత్తుటిపుండు!

Sunday, January 3, 2016

!! నిశ్శబ్దానందం !!

ఈ ఉదయం మా పెరట్లో
ఎంత నిశ్శబ్దం
ఎంత ఆనందం

నెత్తిమీద వేలాడుతున్న చింతకొమ్మ చిత్రంలోంచి
నా చూపుని కాజేసి
కొబ్బరి మొవ్వలో కునుకుతీస్తోన్న
రంగురెక్కలపిట్ట గుండెచప్పుడు తప్ప

ఏ పువ్వు మీద వాలాలో తేల్చుకోలేక
ఆకొమ్మ మీదకీ ఈ కొమ్మమీదకీ ఎగురుతున్న
సీతాకోక సందిగ్ధపు అడుగుల చప్పుడు తప్ప

నీలంగా నిర్మలంగా మెరుస్తూ
ఏ మేఘంకోసమో
ఏ నక్షత్రంకోసమో
ఏ చందమామకోసమో
నా లోపలి ఆకాశం పిలుస్తోన్న పిలుపులు తప్ప

మరే శబ్దమూ లేని నిశ్శబ్దం!

మొలకెత్తుతున్న ప్రశ్నేమిటంటే,
ఆనందం నిశ్శాబ్దానిదా? నిశ్శబ్దం వినిపించిన ఇన్నిన్ని శబ్దాలదా?