Thursday, December 19, 2013

!!అమావాస్య చుక్క!!

ఏమరపాటుగానైనా
నావైపు చూస్తావేమో అని..

ఎప్పుడైనా పొరపాటుగానైనా
నన్ను పలకరిస్తావేమోనని..

యెనక పొద్దుజారుతున్నా
ముందు చీకటి మూగుతున్నా

ముఖాన్ని మూడింతలు చేసి
కళ్లుకాయలు కాసేలా చూసీ చూసీ..
అలసి సొలసి ఇక విశ్రమించబోతే,

"అపుడేనా" అన్నట్టు వెక్కిరించాయి
చందమామకోసం చూస్తున్న అమావాస్య చుక్కలు.

అంతే, మళ్లీ లేచి కూచున్నాను..

Tuesday, December 17, 2013

!! నిష్క్రమణం !!

విత్తుగా పుట్టి
వృక్షమై వెలిగినా
ఒకనాటికి
ఆకులురాలి, వేళ్లుకుళ్ళి
మునగదీసుకుని
మట్టిలో కలిసిపోవడమే

ఎంతటి ఎండలకు
ఎదురొడ్డి నిలిచావో
ఎన్నెన్ని వసంతాలకు
ఎద పులకరించి పాడావో
లెఖ్ఖేలేదు.. అది లెక్కాకాదు
ఆనాటికి
నీ కొమ్మల పురుడుపోసుకున్న
పక్షులు ఎగిరిపోతాయి
నీ నీడన తలదాచుకున్న బతుకులు
ఎక్కడివో..మళ్ళీ అక్కడికే పయనమవుతాయి

అల్లుకున్న అనుబంధాలు
నాలుగు కన్నీటి చుక్కలుగా రాలి
శ్రాద్ధకర్మలుగా మారి
మరపువనంలో మొలకెత్తుతాయి
ఆక్షణం
నీ కళ్ళముందు కదలాడే జీవితం
ఒక కల...
కనురెప్ప వాలగానే
కలమాయం..శూన్యంలోకి ప్రయాణం షురూ!!




Wednesday, December 11, 2013

!!ఎవరు నేను!!

 !!ఎవరు నేను!!

నిరాకారమై నిర్వికారమై
సమాశ్వాసమున సత్యమై చెలగిన
నభఃప్రాణము నేను

నిజమై నిత్యయవ్వనమై
నిగనిగల దేహమై ఎగసిన
నిప్పును నేను

అవ్యక్తమై అంతరాళమై
అణువణువుకూ ఆధారమై అందిన
నేలను నేను

నీలమై నిఖిలమై
నవనవోన్మేషముగ తారానిలయమై నిలచిన
నింగిని నేను

చరమై చంచలమై
సెలయేటి ఘోషల సంచలనమై రేగిన
నీరును నేను

అంతరంగమై అనంతజీవనరాగమై
ఆత్మకోకిల గానమై పలికిన
ఓంకారం నేను

నిరతమై అనిగళమై
నిశీధిగుండెల నిషాదమై ధ్వనించిన
కాంతిరేఖను నేను

నియమమై నిరాఘాటమై
నభోపాత్రుని నిరంతరపయనమై సాగిన
కాలప్రవాహం నేను

నిస్వార్థమై నిష్కల్మషమై
సృష్టిగమనానికి సాక్ష్యమై ప్రభవించిన
ప్రేమను నేను

పంచభూతములూ నేనే
పరమార్థములూ నేనే
ప్రకృతినీ నేనే
పురుషుణ్ణీ నేనే...

(.."నువ్వెవరు" అన్న ఆత్మారాముని ప్రశ్నకు పలికిన ఉపశమనం)

Monday, December 9, 2013

!!మరోఉదయం !!

పున్నమిరేయి కరిగిపోతూ
పుడమితల్లిని మేలుకొలిపింది

తూరుపుదిశ ఎర్రబారుతూ
తొలివెలుగుకు తెరలుతీసింది

శుకపికాల కలరవమ్మున
సుప్రభాతం శ్రుతి కుదిరింది

ఉదయభానుని కిరణస్పర్శతో
పొగలుపొగలుగా మంచు తరలిపోతోంది

నల్లగా నిదురపోయిన
ఆకులూ పూరేకులూ రంగులు పులుముకున్నాయి

అవనియవనికపై అందంగా
మరోఉదయం మొదలయింది