Tuesday, March 15, 2016

!! చల్తేరహో !!

కోతపెట్టిన గాయాలు
కొత్తగా చివుళ్లెత్తుతూనే ఉంటాయి
కమ్ముకోడానికి చీకట్లు 
ఓ వైపు కాచుకునే ఉంటాయి
వేసే ప్రతి అడుగు కిందా
వేల సందేహాలు మొలకెత్తుతూనే ఉంటాయి
సంకల్పానికీ సమస్యకీ సంఘర్షణలో
సతమతమవుతుంది గుండె
కొట్టుమిట్టాడుతుంది గుండె
రెక్కలు విరిగి
రివ్వున ఎగరలేకపోతుంది గుండె
కూలనివ్వకు
కల కరగనివ్వకు
చుట్టుపక్కల చూడు
మనసంతా కళ్లు చేసుకుని చూడు
రేకు విచ్చుకుంటున్న మల్లెపూవు
నీకోసం కాస్త పరిమళాన్ని దాచే ఉంటుంది
రెక్క తొడుక్కుంటున్న గొంగళిపురుగు
నీకోసం ఒక పాఠాన్ని పదిలపరచే ఉంటుంది
నీలికళ్ల ఆకాశమో
నీటిలో కదిలే సాంధ్యకిరణమో
వెలుగును మింగే చీకటో
చీకటిని వెలిగించే రెక్కలనక్షత్రాలో
నీక్కొంచెం శక్తినివ్వడానికి సిద్దంగానే ఊంటాయి
నువు చేయాల్సిందల్లా ఒకటే
మనసంతా కళ్లు చేసుకుని చూడు
ప్రకృతి తన ప్రేమతో
నిన్ను పరామర్శిస్తుంది
కాలమొక తెల్లకాగితంలా మడత విప్పుకుని
నీ సంతకం కోసం నిరీక్షిస్తుంది.

03.03.16

!! RED BLOOD !!

ఆకలి కాల్చిన ఒక్కపేగుకూ 
నువ్వింత అన్నమివ్వలేదు 
అణచివేతలో రాలిన ఒక్కహృదయాన్నీ 
నువ్వు తిరిగి అతికించలేదు
దోపిడీదారుల మధ్య దగాపడ్డ ఒక్కబతుకునూ
నువ్వు నిలబెట్టలేదు
అడవి తన ఉక్కుపిడికిళ్లతో సంధించిన ఒక్కప్రశ్నకూ
నువ్వు సమాధానమివ్వలేదు
కడుపులు కాలి
రెక్కలు రాలి
నెత్తురు మండి నీపై తిరగబడ్డ ప్రాణాలకు
నువ్వు విలువివ్వలేదు
అధికారమా
గుర్తుంచుకో
ఈరోజు నీ తుపాకీగుండు తాకి
చిమ్మింది సాదాసీదా రక్తం కాదు
బొట్టుబొట్టులో వేల సూర్యుళ్లను నింపుకున్న
ఎర్రెర్రని రక్తం.