Thursday, November 26, 2015

!! నిత్యసత్యం !!

అవును కదా,
ఎంత నిస్సహాయతను కొనితెచ్చుకుంటున్నామో!

కంటిచూపు, చేతిస్పర్శ, మనసూ, మాటలూ నెరపాల్సిన మానవసంబంధాల్ని ఏ ఆధునిక ఉపకరణాలకో ఏ అవ్యక్త అనుభూతులకో అప్పగించేసి ఎవరికివారిమై ఏకవ్యక్తి సమూహాల్ని నిర్మించుకుంటున్నాం.

ఖాళీ లేదు. ఏకాంతం లేదు. కలల్లేవు. కరుణ లేదు. కవిత్వం లేదు.

ఉన్నదల్లా గమ్యం తెలియని ఉరుకులాట.గెలుపోటములు మాత్రమే మిగిలిన ఆట. పెనుగులాట. ముసుగులో గుద్దులాట. దేహసరిహద్దుల్లోనే కనుమరుగవుతోన్న మానవతాపాట.

ఎన్నాళ్లయిందో ఎదుటివ్యక్తి కళ్లలోకి చూసి ఒక్క చిర్నవ్వు నవ్వి. ఎన్నాళ్లయిందో ఒక తడిచెంపమీద చేతులేసి సేదదీర్చి. ఎన్నాళ్లయిందో ఒక పాటలోని గమకానికి పరవశమొంది. ఎన్నాళ్లయిందో పసిబుగ్గల పాపాయిని పైకెగరేసి పట్టుకుని. ఎన్నాళ్లయిందో... కిటికీపక్కన గువ్వపిట్టకు గుప్పెడు గింజల్ని గుమ్మరించి.

ఏ అగ్నిపర్వతపు ఎద బద్దలైనపుడు ఎగిరిపోయిందో మనలోని సున్నితత్వం. మనలోని మృదులత్వం. మనలోని మనిషితనం. ఏ ఉప్పెన ఎత్తుకెళ్లిందో ఏ భూకంపం పెకిలించివేసిందో ఏ మహాకుంభవృష్టి తుడిచేసిపోయిందో..

కంటిచూపుని కాజేసిన కాళరాత్రి రంగు తెలియదు. చేతిస్పర్శను మింగేసిన చేదు క్షణాలు గుర్తుకురావు. మనసెప్పుడు మాయమయిందో మాటలెప్పుడు మౌనసంద్రంలో మునిగిపోయాయో లెక్కతెలియని అమాయకత్వం. లెక్కేదొరకని అభద్రత.

కన్నుతెరిచింది మొదలు కాళ్లకొకటే పని. ఎన్ని వలల్లో చిక్కుకుంటుందో ఎన్ని వలయాల్లో ఇరుక్కుపోతుందో ఏకాంతం ఎదుటకు రాదు. కంటినిండా నిద్ర కరవై కలవరింతల కలలు పండకుండానే రాలిపోతాయి. కరుణసాగరంలో పొంగుకొచ్చే అలలు తీరం చేరకుండానే గడ్డకట్టుకుపోతాయి.

నీకూ తెలియదు. నాకూ తెలియదు. కాలమెలా కదులుతోందో ఎక్కడెలా ఆగుతోందో మళ్లీ ఏ మలుపులో మొదలవుతోందో. ఏ గాయాలను మాన్పుతోందో ఏ చరిత్రపుటలకి అక్షరాలిస్తోందో ఏ మూలలో ఎవర్ని ఎందర్ని దాచేసిపోతోందో.

నేస్తమా! ఇలాగే నడుస్తూ పోదామా? శవపేటికకు ఒక్కో పుల్లను పేర్చుకుంటూ?


(అఫ్సర్ మొహమ్మద్ గారి కవితొకటి చదివినపుడు మెదిలిన భావం)

2 comments:

Bharathi said...

నేస్తమా! ఇలాగే నడుస్తూ పోదామా? శవపేటికకు ఒక్కో పుల్లను పేర్చుకుంటూ? Killer lines..

నవీన్ కుమార్ said...

Thanks akka :)