Sunday, January 4, 2015

!! రాత్రి !!

పడమటి అంచు
అందంగా రంగులు మారుతుంటుంది
అదృశ్యశక్తులేవో
నింగిపైకి నక్షత్రాల వర్షం కురిపిస్తాయి
పిల్లకాలువలో కాగితప్పడవలా
చందమామ తేలుతూ వస్తాడు
నిశ్శబ్దంగా రాత్రి నిద్రలేస్తుంది

శీతాకాలపు సమీరంలా
పాదాలను తాకి
నిగూఢ సందేశాలు దాగిన పరిమళంలా
దేహాన్ని చుట్టి
నిస్సారపు నీడలు దూరంచేసి
ఆలోచన అడుగులు నెమ్మదిచేసీ
మనసును మరోలోకంలోకి తీసుకెళ్తుంది రాత్రి

కలలకౌగిట బంధించి
వెన్నెలవీధుల తిప్పించి
గుప్పిట గుట్టుగాదాచిన మధురక్షణాలను
గమ్మత్తుగా విప్పుతుంది రాత్రి

శ్రుతితప్పని ఈ లాలిపాటకు
నిదురించని దేహమూ లేదు పులకించని ప్రాణమూలేదు
సుతిమెత్తని ఈ రాత్రిస్పర్శకు
కదలని హృదయమూ లేదు కరగని శోకమూలేదు

4 comments:

ghousuddin shaik said...

నిజమే మనసును మరో లోకంలోకి తీసుకెళ్ళేది రాతిరే....బావుంది భావం...

Padmarpita said...

కలలకౌగిట బంధించి
వెన్నెలవీధుల తిప్పించి..నచ్చిందండి.

Anangi Balasiddaiah said...

రాత్రిని..ఇంతచక్కగా..వర్ణించిన వారేవరూ లేరు..

నవీన్ కుమార్ said...

అందరికీ ధన్యవాదాలు :)