Friday, October 31, 2014

!! తిరిగొస్తాను !!

నీకు తెలుసో లేదో
అనేకానేక యుద్ధాలు అవతరిస్తున్న చోట
ఆకాశమంత హృదయం చినుకులుగా రాలుతున్నచోట
ఇక్కడ..
ఒక ఆత్మ నిన్నుచేరడానికి విశ్వప్రయత్నం చేస్తోంది
నిన్ను చేరేవరకు నీలో లీనమయ్యేవరకు నిరీక్షించలేవా!

ఇటుచూడు
చిగురాకు చివర్న ముత్యపుతునకలా మంచుబిందువు
వానలో తడిసిన ఓ బంతిపూల తోట
విరగబూసిన తంగేడు చెట్టూ
నిండుపున్నమినాటి పండువెన్నెలా
నీకోసమే వేచిఉన్నాయి..నీ స్పర్శకై తహతహలాడుతున్నాయి

లేలేత రావి ఆకు ఎరుపు
దారిపక్కగా మొలిచిన తుమ్మిపూల తెలుపు
పైరుపాపల ఆకుపచ్చా
సముద్రాకాశాలు కలిసినప్పటి నీలం
నీ రాకకై చూస్తున్నాయి.. నీ బతుకులో కలిసిపోవాలని కలలు కంటున్నాయి

దిగులెందుకు నేస్తం!
ఆ మంచుబిందువును ముద్దాడు.. బంతిపూలతోటలో తిరుగాడు.. తంగేడు చెట్టుని గట్టిగా హత్తుకో.. పున్నమివెన్నెల్లో కరిగిపో.. రంగులన్నిటినీ కలిపి రేపటి బతుకుపుస్తకానికి అందమైన ముఖచిత్రాన్ని చిత్రించు.. అందులోని ఆత్మనై నేను తిరిగొస్తాను.

Sunday, October 26, 2014

!! కాలం రచించుకున్న కవికి !!

ఆదివారం ఒక ఆనందం. ఆదివారం వానకురవడం మరీ ఆనందం. వానని చుస్తూ కవిత్వం చదవడం ఇంకా ఆనందం. వానని చూస్తూ జీవితాన్ని కవిత్వంగా మలచుకొన్న కవిని కలుసుకోవడం ఇంకా ఇంకా ఆనందం. "నదీమూలం లాంటి ఆ ఇల్లు" మళ్ళీ చదివానివాళ. ఇంకా ఏదో మిగిలేఉంది, ఇంకా ఎక్కడికో చేరుకోవాలి, ఇంకా ఏదో సాంధించాలి, ఇంకా ఎవర్నో కలుసుకోవాలి, ఇవాళ్టినుంచి రేపటిలోకి కొత్తగా మొలకెత్తాలి అనే తపన ఆసాంతం తడిపేసింది. అమ్మదగ్గర్నుంచి అబద్దపు అనుబంధం వరకు, అన్నమ్ముద్ద నుంచి ఆకలికేక వరకూ జీవితంలోని అన్నివిషయాలూ కవిత్వీకరణం చెందాయిక్కడ. కవిత్వం మానవీకరణ చెందిందిక్కడ.

"ఏమీ ఆశించకుండా ఎవరైనా నిన్ను కలుసుకోవడానికి వచ్చారంటే మనిషిగా నువ్వింకా మిగిలేఉన్నావు" అన్నమాటలు చదువుతుంటే ఏదో జీవితతత్వం బోధపడినట్లైంది. "ముసుగులెందుకు, మునగదీసుకుపోవడాలెందుకు నిద్రించే ఊహలమీద నెగడ్లు పెట్టి నిన్నునువ్వు డప్పులా ఎగిసే నిప్పుకణికల మీద కాచుకో"మంటూంటే ఒంట్లోకి కొత్తరక్తాన్ని ఎక్కించి చల్తేరహో చల్తేరహో అని దీవించినట్లైంది. కట్టేసిన నల్లాలోంచి బొట్లుబొట్లుగా కారుతున్న నీటిశబ్దంలో యాంత్రికజీవనపు నిట్టూర్పులు వివరిస్తూంటే అసలుజీవితం గుర్తొచ్చినట్లైంది. కళ్ళుమూసి తెరిస్తే నేనొక పద్యాన్నట. కదిలినా కన్నీళ్ళుపెట్టినా, ఉద్వేగపడినా వెక్కిరింతలుపోయినా పద్యమేనట..వింటూంటే ప్రతిపద్యంలోనూ ఒలికిన ఒక జీవితాన్ని చూసినట్లైంది. దూరమైపోయిన నదీమూలం లాంటి ఆ ఇంటిని, వాకిట్లోని వేపచెట్టుని కలలారా కలిసి, కన్నీళ్ళతో సముదాయించి, ప్రేమించబడీ, క్షమింపబడీ ఎదలో ఇంకా మిగిలేఉన్న దుఃఖపుకలను వివరిస్తూంటే నాలోనూ ఏదో ప్రశ్న పొడసూపినట్లైంది. స్వచ్చత నిండిన అనుబంధాలు కొన్నినింటిని గూర్చి చదువుతూంటే ఆకుపచ్చనిగాలేదో చెక్కిళ్ళను తడిమినట్లైంది. కవివేసిన విత్తనంలోంచి మొలకెత్తుకొచ్చిన వనంలో నేనూ చిగుర్లేస్తున్నానన్న నిజాన్ని చూస్తూంటే కళ్ళలో ఒక గర్వరేఖ మెరిసినట్లైంది. గాలిలో తేలుతూ వచ్చిన రెండు ఈకల రెపరెపల్లో ఒక అసలైన జీవితపు వాసనను చూస్తే చూపిస్తే అనుభవాల రెక్కలుతొడిగి తప్పక మళ్ళీ ఎగురుతాం అన్న విశ్వాసాన్ని నింపితే నాకైదో అయినట్లైంది.. రెప్పలమాటులోంచి రెండు చుక్కలు జారినట్లైంది. కలవరపెట్టే కలలు రోజంతా చెప్పే రహస్య గుసగుసలు నాతోనూ కొన్ని పంచుకున్నట్లైంది.. ఆ నీడపక్కనే నాతోనూ నడిచినట్లైంది.

కవిత్వం మాత్రమే కనబడలేదు. అస్తిత్వం ప్రశ్నగా మిగలకపోవడం కోసం మనిషి చేసే ప్రయత్నాలే కనిపించాయి.. చేయాల్సిన ప్రయత్నాలే కనిపించాయి. చదవడం పూర్తయ్యేసరికి వాన వెలిసింది.. ఏవో వెలుగుకిరణాలు సూటిగా తాకడం మొదలైంది. బయటా.. లోపలా.

Thursday, October 23, 2014

!! గమనం !!

నిగనిగలాడిన
నిన్నటి నిజాలు
నేడు నల్లని అబద్దాలు

నియమాలై
నడిపించిన నమ్మకాలు
నేడు నిలువనీడలేని అనాధలు

చవులూరించిన
తియ్యని అనుభూతులు
నేడు చెదరని చేదు జ్ఞాపకాలు

కాలం చేసే కనికట్టులో

పరుగులెత్తిన ప్రవాహాలు
నేడు నిశ్చల పయోధి తరంగాలు

ఎర్రెర్రగా మండిన ఎండలు
నేడు మసిపూసుకున్న రాత్రులు

కనికరంలేని ఆ కాలం చేసే కనికట్టులో

కలలు కుమరించి రాసుకున్న కావ్యాలు
నేడు అర్థాన్ని వెదుక్కుంటున్న పదసమూహాలు

ఆశల అలలతో పోటెత్తిన సముద్రాలు
నేడు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్న మేఘావళులు

కాలమొకటే కానీ,
గట్టున కూచుని ప్రవాహాన్ని గమనించడమూ
అందులోపడి మునిగిపోవడమూ
ఒకటి కాదు!

Tuesday, October 21, 2014

!! రక్తకన్నీరు !!

యుగాలుగా కంటున్నకల
మెలితిరిగినప్పుడల్లా
మెలకువొస్తుంది నాకు
కళ్ళు తెరిచిచూస్తే
యేరులై ప్రవహిస్తున్న రక్తం
నాఒంట్లోలాంటిదే..నాదే
ఆ రక్తంతో కలసి ప్రవహిస్తూ
నా కలలో ఎగిరిన శాంతికపోతం కన్నీళ్ళు

Thursday, October 16, 2014

!! ఒక సందిగ్ధంలోంచి.. !!

ఆకాశంలో దారితప్పి
అక్కడక్కడే ఎగురుతున్న
ఒక పక్షి

కనుచూపును అడ్డగిస్తూ
కూలడానికి సిద్ధంగాఉన్న
ఒక పాతకాలపు గోడ

నాకుమాత్రమే వినబడుతూ
జీవితాన్ని రెండుముక్కలు చేయబోతున్న
ఒక గుండెచప్పుడు

* * *

విచిత్ర సందేశాలను
సూటిగా సంధిస్తూ
కొన్ని మేఘాకృతులు

పిల్లతెమ్మెర స్పర్శకి
పులకించి పాడుతూ
లేత చివుళ్ళు

మెదడుపొరల్లో
మొలకెత్తుతూ కొత్తజీవితపు విత్తనాలు