Thursday, December 4, 2014

!! కంపిత !!

చీకటి రెక్కలను విశాలంగా విప్పుకుని
వీడని చిక్కుముళ్ళని వెంటతెస్తున్నదీరాత్రి

గుండెధైర్యపు పునాదులు కదిలించే
గునపంలా దూసుకొస్తున్నదీరాత్రి

కలల అద్దాల మేడపై
దట్టమైన మంచులా పరుచుకుంటున్నదీరాత్రి

మరణసాదృశ ఉదయాన్ని
వేయిభుజాలపై మోసుకొస్తున్నదీరాత్రి

ఎలా ఈ చీకటిని వెలివేయను?
ఎలా ఈరాత్రి రాకను నిషేదించను?


నవీన్ కుమార్ !! 04/12/2014

Monday, December 1, 2014

!! అస్తిత్వపు ప్రశ్న - 2 !!

బరువుగా సాగిపోయే మేఘాల్నెపుడైనా ఓదార్చావా?
మింటి మేనివిరుపుల ముగ్ధతనెపుడైనా ముద్దాడావా?
ఆత్మీయచినుకుల్నెపుడైనా గుండెదోసిట్లోకి ఒడిసిపట్టుకున్నావా?
పోనీ
నవనవోన్మేషమైన పొద్దుపొడుపు గీతాల్ని విన్నావా?
పసిపగలుగా మిగల్లేని రాత్రిపడతిగా మారలేని సంధ్యాసతి సందిగ్ధాన్ని స్పృశించావా?
అదీపోనీ
నిశిరాత్రితో జంటగా నడిచావా నీవెపుడైనా?
నక్షత్రాలతో నిండుగా మాటలాడావా?
కౌముదిని కెరటాల్నీ కౌగిలించడం అబ్బిందా?
లేదా?
మరి జీవిస్తున్నట్టు చెప్పుకుంటున్నావే!
ఇవన్నీపోనీ
నీ లోలోపలికెపుడైనా తొంగిచూసావా?
నీలోనే నిండిఉన్న అనంతప్రవాహాల్నెపుడైనా తడిమి చూసావా?
మౌనాన్ని అదుముకుని
రెప్పలమాటున నీకై దాగిన నిశ్శబ్దసముద్రంలోకి చీకటిమహాసముద్రంలోకి ఎపుడైనా దూకావా? అందులో మునకలేసావా?
మరి మనిషిగా ఏం మిగిలినట్టు?
దేహంలోకి
కేవలం దేహంలోకి కుదించుకుపోతోందా నీలో జీవం?
ప్రకృతిని చదవడం నేర్పలేదా ఎవరూ?
ప్రకృతితో సంగమించడం నేర్చుకోలేదా నువ్వు?

నవీన్ కుమార్ !! 01/12/2014

Thursday, November 27, 2014

!! అస్తిత్వపు ప్రశ్న !!


తోడు తెచ్చుకున్న తొడుగుల్ని వదలి
అదృశ్య తీరాలవైపు పరుగులు మాని
నిరంతరంగా ప్రకృతి గీస్తున్న ఈ వర్ణచిత్రంలో
మనిషి మనిషిగా ఆవిష్కృతమయ్యేదెపుడు?

నీలిసంద్రపు అలలపై
తేలుతున్న మేఘాల్లానో
గగనసీమల అంచుల్నుంచి
జారుతున్న జలపాతాల్లానో

తీరని తెలిమంచులో
తళుకుమనే లోయల్లానో
అఖాతాల అడుగునుంచీ
పైకెదిగే.. పైకేఎదిగే చెట్లలానో

నిరంతరంగా ప్రకృతి గీస్తున్న ఈ సుందర వర్ణచిత్రంలో
మనిషి మనిషిగా ఆవిష్కృతమయ్యేదెపుడు?


!! నవీన్ కుమార్ !! 28/11/2014

Friday, October 31, 2014

!! తిరిగొస్తాను !!

నీకు తెలుసో లేదో
అనేకానేక యుద్ధాలు అవతరిస్తున్న చోట
ఆకాశమంత హృదయం చినుకులుగా రాలుతున్నచోట
ఇక్కడ..
ఒక ఆత్మ నిన్నుచేరడానికి విశ్వప్రయత్నం చేస్తోంది
నిన్ను చేరేవరకు నీలో లీనమయ్యేవరకు నిరీక్షించలేవా!

ఇటుచూడు
చిగురాకు చివర్న ముత్యపుతునకలా మంచుబిందువు
వానలో తడిసిన ఓ బంతిపూల తోట
విరగబూసిన తంగేడు చెట్టూ
నిండుపున్నమినాటి పండువెన్నెలా
నీకోసమే వేచిఉన్నాయి..నీ స్పర్శకై తహతహలాడుతున్నాయి

లేలేత రావి ఆకు ఎరుపు
దారిపక్కగా మొలిచిన తుమ్మిపూల తెలుపు
పైరుపాపల ఆకుపచ్చా
సముద్రాకాశాలు కలిసినప్పటి నీలం
నీ రాకకై చూస్తున్నాయి.. నీ బతుకులో కలిసిపోవాలని కలలు కంటున్నాయి

దిగులెందుకు నేస్తం!
ఆ మంచుబిందువును ముద్దాడు.. బంతిపూలతోటలో తిరుగాడు.. తంగేడు చెట్టుని గట్టిగా హత్తుకో.. పున్నమివెన్నెల్లో కరిగిపో.. రంగులన్నిటినీ కలిపి రేపటి బతుకుపుస్తకానికి అందమైన ముఖచిత్రాన్ని చిత్రించు.. అందులోని ఆత్మనై నేను తిరిగొస్తాను.

Sunday, October 26, 2014

!! కాలం రచించుకున్న కవికి !!

ఆదివారం ఒక ఆనందం. ఆదివారం వానకురవడం మరీ ఆనందం. వానని చుస్తూ కవిత్వం చదవడం ఇంకా ఆనందం. వానని చూస్తూ జీవితాన్ని కవిత్వంగా మలచుకొన్న కవిని కలుసుకోవడం ఇంకా ఇంకా ఆనందం. "నదీమూలం లాంటి ఆ ఇల్లు" మళ్ళీ చదివానివాళ. ఇంకా ఏదో మిగిలేఉంది, ఇంకా ఎక్కడికో చేరుకోవాలి, ఇంకా ఏదో సాంధించాలి, ఇంకా ఎవర్నో కలుసుకోవాలి, ఇవాళ్టినుంచి రేపటిలోకి కొత్తగా మొలకెత్తాలి అనే తపన ఆసాంతం తడిపేసింది. అమ్మదగ్గర్నుంచి అబద్దపు అనుబంధం వరకు, అన్నమ్ముద్ద నుంచి ఆకలికేక వరకూ జీవితంలోని అన్నివిషయాలూ కవిత్వీకరణం చెందాయిక్కడ. కవిత్వం మానవీకరణ చెందిందిక్కడ.

"ఏమీ ఆశించకుండా ఎవరైనా నిన్ను కలుసుకోవడానికి వచ్చారంటే మనిషిగా నువ్వింకా మిగిలేఉన్నావు" అన్నమాటలు చదువుతుంటే ఏదో జీవితతత్వం బోధపడినట్లైంది. "ముసుగులెందుకు, మునగదీసుకుపోవడాలెందుకు నిద్రించే ఊహలమీద నెగడ్లు పెట్టి నిన్నునువ్వు డప్పులా ఎగిసే నిప్పుకణికల మీద కాచుకో"మంటూంటే ఒంట్లోకి కొత్తరక్తాన్ని ఎక్కించి చల్తేరహో చల్తేరహో అని దీవించినట్లైంది. కట్టేసిన నల్లాలోంచి బొట్లుబొట్లుగా కారుతున్న నీటిశబ్దంలో యాంత్రికజీవనపు నిట్టూర్పులు వివరిస్తూంటే అసలుజీవితం గుర్తొచ్చినట్లైంది. కళ్ళుమూసి తెరిస్తే నేనొక పద్యాన్నట. కదిలినా కన్నీళ్ళుపెట్టినా, ఉద్వేగపడినా వెక్కిరింతలుపోయినా పద్యమేనట..వింటూంటే ప్రతిపద్యంలోనూ ఒలికిన ఒక జీవితాన్ని చూసినట్లైంది. దూరమైపోయిన నదీమూలం లాంటి ఆ ఇంటిని, వాకిట్లోని వేపచెట్టుని కలలారా కలిసి, కన్నీళ్ళతో సముదాయించి, ప్రేమించబడీ, క్షమింపబడీ ఎదలో ఇంకా మిగిలేఉన్న దుఃఖపుకలను వివరిస్తూంటే నాలోనూ ఏదో ప్రశ్న పొడసూపినట్లైంది. స్వచ్చత నిండిన అనుబంధాలు కొన్నినింటిని గూర్చి చదువుతూంటే ఆకుపచ్చనిగాలేదో చెక్కిళ్ళను తడిమినట్లైంది. కవివేసిన విత్తనంలోంచి మొలకెత్తుకొచ్చిన వనంలో నేనూ చిగుర్లేస్తున్నానన్న నిజాన్ని చూస్తూంటే కళ్ళలో ఒక గర్వరేఖ మెరిసినట్లైంది. గాలిలో తేలుతూ వచ్చిన రెండు ఈకల రెపరెపల్లో ఒక అసలైన జీవితపు వాసనను చూస్తే చూపిస్తే అనుభవాల రెక్కలుతొడిగి తప్పక మళ్ళీ ఎగురుతాం అన్న విశ్వాసాన్ని నింపితే నాకైదో అయినట్లైంది.. రెప్పలమాటులోంచి రెండు చుక్కలు జారినట్లైంది. కలవరపెట్టే కలలు రోజంతా చెప్పే రహస్య గుసగుసలు నాతోనూ కొన్ని పంచుకున్నట్లైంది.. ఆ నీడపక్కనే నాతోనూ నడిచినట్లైంది.

కవిత్వం మాత్రమే కనబడలేదు. అస్తిత్వం ప్రశ్నగా మిగలకపోవడం కోసం మనిషి చేసే ప్రయత్నాలే కనిపించాయి.. చేయాల్సిన ప్రయత్నాలే కనిపించాయి. చదవడం పూర్తయ్యేసరికి వాన వెలిసింది.. ఏవో వెలుగుకిరణాలు సూటిగా తాకడం మొదలైంది. బయటా.. లోపలా.

Thursday, October 23, 2014

!! గమనం !!

నిగనిగలాడిన
నిన్నటి నిజాలు
నేడు నల్లని అబద్దాలు

నియమాలై
నడిపించిన నమ్మకాలు
నేడు నిలువనీడలేని అనాధలు

చవులూరించిన
తియ్యని అనుభూతులు
నేడు చెదరని చేదు జ్ఞాపకాలు

కాలం చేసే కనికట్టులో

పరుగులెత్తిన ప్రవాహాలు
నేడు నిశ్చల పయోధి తరంగాలు

ఎర్రెర్రగా మండిన ఎండలు
నేడు మసిపూసుకున్న రాత్రులు

కనికరంలేని ఆ కాలం చేసే కనికట్టులో

కలలు కుమరించి రాసుకున్న కావ్యాలు
నేడు అర్థాన్ని వెదుక్కుంటున్న పదసమూహాలు

ఆశల అలలతో పోటెత్తిన సముద్రాలు
నేడు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్న మేఘావళులు

కాలమొకటే కానీ,
గట్టున కూచుని ప్రవాహాన్ని గమనించడమూ
అందులోపడి మునిగిపోవడమూ
ఒకటి కాదు!

Tuesday, October 21, 2014

!! రక్తకన్నీరు !!

యుగాలుగా కంటున్నకల
మెలితిరిగినప్పుడల్లా
మెలకువొస్తుంది నాకు
కళ్ళు తెరిచిచూస్తే
యేరులై ప్రవహిస్తున్న రక్తం
నాఒంట్లోలాంటిదే..నాదే
ఆ రక్తంతో కలసి ప్రవహిస్తూ
నా కలలో ఎగిరిన శాంతికపోతం కన్నీళ్ళు

Thursday, October 16, 2014

!! ఒక సందిగ్ధంలోంచి.. !!

ఆకాశంలో దారితప్పి
అక్కడక్కడే ఎగురుతున్న
ఒక పక్షి

కనుచూపును అడ్డగిస్తూ
కూలడానికి సిద్ధంగాఉన్న
ఒక పాతకాలపు గోడ

నాకుమాత్రమే వినబడుతూ
జీవితాన్ని రెండుముక్కలు చేయబోతున్న
ఒక గుండెచప్పుడు

* * *

విచిత్ర సందేశాలను
సూటిగా సంధిస్తూ
కొన్ని మేఘాకృతులు

పిల్లతెమ్మెర స్పర్శకి
పులకించి పాడుతూ
లేత చివుళ్ళు

మెదడుపొరల్లో
మొలకెత్తుతూ కొత్తజీవితపు విత్తనాలు

Monday, September 22, 2014

!! ఐదు ముఖాలు !!

అది
ఆదిమధ్యాంతరహిత మంచుకొండని తెలిసీ
కరుగుతున్న ప్రతిక్షణాన్నీ
పదిలపరచాలని చూస్తున్నాడొకడు

ప్రచండమైన పడమటి వెలుగుల్ని చూస్తూకూడా
రేపటి ప్రశాంత ఉదయాన్ని స్వప్నిస్తున్నాడొకడు

హృద్యంతరాలలోంచి పొంగిన ఒకనది
సముద్రమయ్యాక కూడా
తిరిగి తనలోకి ప్రవహిస్తుందని వేచిచూస్తున్నాడొకడు

ఆనందరాగం అనంతవాయువుల్లో లీనమయ్యాక కూడా
వేణువును వెర్రిగా తడుముతున్నాడొకడు

నిజంలాంటి నిప్పు నిలువునా కాలుస్తున్నా కూడా
ఒక ప్రవాహంలోకి తొంగిచూస్తూ
తన ఐదవముఖానికి రంగులేస్తున్నాడొకడు

Tuesday, September 16, 2014

!! పగిలిన అద్దం !!

పగిలిన అద్దం ఎక్కడిదంటే
పడదోసిన పాపం ఎవ్వరిదన్నాడు

పగిలిన అద్దం ఎవ్వరిదంటే
ప్రశ్నలు మాత్రం ఎక్కడివన్నాడు

పగిలిన అద్దం ఏం చెప్పిందంటే
పరుగుల శబ్దం విన్లేదా అన్నాడు

పగిలిన అద్దం ఏం చూపిందంటే
పొదిగిన కలలను కన్లేదా అన్నాడు

పగిలిన అద్దం ఏం చేస్తోందంటే
పొగిలి పొగిలి నవ్వుతోందన్నాడు

ఎవడువీడు?
ఏమైంది వీడికి?

Thursday, September 11, 2014

!! వేచి ఉండండి !!

సముద్రాలు పాతవే
కొత్త తీరాలు నిర్మిస్తున్నాను

చీకట్లు పాతవే
కొత్త వెలుగులు పూయిస్తున్నాను

శోకతప్త గ్రీష్మాలూ పాతవే
కొత్త వసంతాలు సృష్టిస్తున్నాను

వేచి ఉండండి!
మీదాకా వస్తాను
మీకూ కొన్ని రంగులు పూస్తాను..

Thursday, August 21, 2014

!! ఋణగ్రస్తం !!

ఒంటరిగా నీ ఒడ్డుకు చేరినపుడు
ఎప్పటిదో..
స్మృతులు శృతులైన ఒక రాగం
నీ నవ్వుల హోరులోంచి లీలగా వినపడి కరిగిపోయింది

ఏకాంతంగా నీతో మాట్లాడినపుడు
ఎప్పటిదో..
ఎదమూలల్లో గడ్డకట్టిన ఒక ప్రశ్న
నీ పలుకుల మలుపుల్లో బదులు వెతుక్కుని బయలుదేరింది

ఆప్యాయంగా నువ్వు హత్తుకున్నపుడు
ఎప్పటిదో..
పగిలిన ఒక హృదయం నీడ
నీ రక్తంతో కలిసి అవతలి ఒడ్డుకు ప్రయాణించింది

ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోను?

Friday, July 4, 2014

!! చివరి కల !!

ఎగసిన భావోద్వేగాల నడుమ
నిండుగా, నాలో
అస్తమిస్తున్న సూర్యుడు

నే పులిమిన రంగుల్లో
పడమటికొండ అంచుల్లో
పొంగులెత్తుతున్న ఎరుపు

వానకాలంలో వంధ్యలోకంలో
నాకోసం మెరిసిన మబ్బులు
ధారగా కురుస్తూ మబ్బులు

కరుగుతున్న కాంతిలో
వొంటరి పక్షినై
నిశీధికేగుతూ నేను

Saturday, June 21, 2014

!! నేను నా ఆకాశం !!


ఆకాశం నా ఆత్మీయ నేస్తం
మౌనంగా
ఎన్ని సంగతులు మాటాడుకుంటామో!
ఎన్నెన్ని కాలాలు ఒకటిగా చూశామో!
నేనంటే ఎంత ప్రేమనుకున్నావ్?

మనసేం బాలేదన్నాననుకో
మేఘాలు సృష్టించీ
ముత్యాలు చిలకరించీ
ముద్ద ముద్ద చేసేస్తుంది

మౌనంగా ఉన్నాననుకో
మెరుపులు మెరిపించీ
ఉరుములు పలికించీ
ఏమైందంటూ ప్రశ్నిస్తుంది

ఏం కాలేదని కళ్లికిలిస్తూ నే చెబితేనేమో
నీలంగా నవ్వేస్తుంది

అటుపోయీ ఇటుపోయీ
అదిచేసీ ఇదిచేసీ
అలసిపోయీ నేనొస్తే
చందమామను పిలిపించి
చుక్కల్ని రప్పించి ఎదపై
వెన్నెల కురిపిస్తుంది

ముభావంగా ఉండి నేనిటుతిరిగి పడుకుంటే
చల్లగాలితో చక్కిలిగింతలు పెట్టిమరీ తనవైపు తిప్పుకుంటుంది
నల్లగా నాతోపాటే నిదురపోయి
నాకంటే ముందే తెల్లగా మేలుకుంటుంది
సంతోషం పంచుకోవాలని చేతులెత్తి నే చిందులేస్తే
చిరుగాలిలా మారి నన్ను చుట్టేసుకుంటుంది

ఒక్కోసారి తనకూ బాధేస్తుంది పాపం!
భోరున విలపిస్తుంది
తననెవరో కాలుస్తున్నట్టూ
తన వలువల్నెవరో విడదీస్తున్నట్టూ
భగ్గున మండిపోతుంది ఆకాశం
పాపం ఆకాశం..
ఎవ్వరితోనూ చెప్పుకోదు..నాతో మాత్రమే
నేనయితే వింటాను కదా!

ఏం చేయగలను?
తనబాధను కాస్తయినా పంచుకుందామని
నిండా తడుస్తాను
నీరైపోతాను..కన్నీరైపోతాను
నేనేడ్వడం చూడలేక
కాసేపటికి శాంతిస్తుంది ఆకాశం
నేనుమాత్రం,
నాలో నిండిన తన దుఃఖాన్ని
బొట్లు బొట్లుగా పిండేస్తాను

ఆకాశానికి దెయ్యాలంటే భయం
నలువైపుల్నుంచీ ఈ మధ్య
దెయ్యాలు చుట్టుముడుతున్నాయి
నలిపేస్తున్నాయి.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి
వయొలిన్ పై విషాదగీతంలా
వినిపిస్తుంది ఆకాశం ఆర్తనాదం
తనకెంత బాధవుతుందనీ! నాకెంత బాధవుతున్నదనీ!
ఒంట్లో ఒకమూలకం ఒంటరిగా పోరాడుతున్నభావన..

నన్నూ తనలో కలిపేసుకోమనీ
నేనూ తనకు సాయపడతాననీ
ఎన్నోసార్లు చెప్పాను..
కరుణామయి కదూ నా ఆకాశం
కాదంది!

కనీసం తన కన్నీళ్లయినా తుడుద్దామంటే
నా చేతులేమో చాలడంలేదు
అందుకే
రెండు మొక్కల్ని పెంచుతున్నాను
అవి ఏనాటికైనా ఆకాశమంత ఎత్తుకు ఎదిగి
నాచేతుల్తో తన చెమ్మను తుడుస్తాయని ఆశ
రోజూ నీరుపోసేటపుడు చెమర్చే నా కళ్ల సాక్షిగా
నా ఆకాశాన్ని ఓదార్చుతాయని ఆశ!

Friday, June 20, 2014

నే రాసిందే

పల్లవి:

రేవెన్నెల నాకన్నుల పూసిన కలువ
మెలికల కొలువా మరి మెరుపుల నెలవా
నువేనా ఆ చెలువ వన్నెల కలవా నువేనా ఆ చెలువ

చరణం:

కలహంస నడకల
కలకంఠి పలుకుల
రాగాల హాసాల రాజీవ నేత్రాల
చిత్తరువును చిత్తరువుగ చెక్కిన వెన్నెల రేయి
చిత్తరువును చిత్తరువుగ చెక్కిన వెన్నెల రేయి
గువ్వగ చేరిన వలపు గుండెను తాకిన పిలుపు
నువేనా ఆ తలపు ఊహల గెలుపు నువేనా ఆ తలపు

చరణం:

మదిలో రాగమై మౌనవీణ నాదమై
సరిగమ సారమై స్వరమై వినిపించి శ్రుతులే సవరించి
ఎదసడి తాళమై ఎదలోతున గానమై
ఎదసడి తాళమై ఎదలోతున గానమై
పాటగ మారిన పిలుపు పువ్వుగ విరిసిన వలపు
నువేనా ఆ మెరుపు తీయని సలుపు నువేనా ఆ మెరుపు

!!ఆత్మీయ అక్షరం!!

గువ్వంతగుండె ఎగరలేక ఎగాదిగా అయినపుడూ
పిసరంత ప్రేమలేకా బతుకుపాట తడబడినపుడూ
పెన్నూ పుస్తకమందుకుంటాను

అలలెత్తే అశ్రువులు 
అక్షరాలుగా ఒదిగి నన్నల్లుకుంటాయి

పెనువిషాదం పలకరించినపుడూ
మరలిరాని నేస్తం మళ్లీ గురుతొచ్చినపుడూ
పెన్నూ పుస్తకమందుకుంటాను

కలం నుంచీ కరిగి కన్నీళ్ళు
కళ్లల్లో కాంతిరేఖలై మెరుస్తాయి

అంతరంగంతో అనేక యుద్ధాల్లో ఓడినపుడూ
నమ్మకాలు నిలువ నీడలేక రాలినపుడూ
పెన్నూపుస్తకమందుకుంటాను

కాగితంపై చింది రుధిరాక్షరాలు
రేపటికి మరోనన్ను ఆవిష్కరిస్తాయి

Thursday, April 3, 2014

ఓ పాట

వేసవి సాయంత్రాన తన ప్రియురాలి కరుణకై ఓకింత విరహముతో ప్రియుడు పాడుతున్న పాట..

సాకీ:
ఎదసడి ఏదోలా రేగేవేళ
పరువము కావ్యాలే రాసేవేళ
పలికేనేదో నాలోన లోలోన
ప్రణయాల ఆలాపన
ఎదసడి ఏదోలా రేగేవేళ

పల్లవి:
కనలేవా మొర వినలేవా
ఓ కన్నెపూవా ఓ కన్నెపూవా
వాంఛలు విరులై విరిసేవేళ
ఊపిరులే మరి ఎగసేవేళ
కనులలో తారకలే నిను కోరేనే

కనలేవా మొర వినరావా
ఓ కన్నెపూవా ఓ కన్నెపూవా

చరణం:
నీ తలపుల చినుకులే
ఎదలో యేరైనవేళ
ఆ ఎదసడి ఎగసెగసి
మువ్వల ముద్దిడిన వేళ
ఘల్లుమన్న రాగమేదో
శ్రుతి కలుపమంటుంటే
మది కలవరపడుతుంటే

కనలేవా కౌగిలినీవా
ఓ కన్నెపూవా ననుచేర రావా

!నవీన్ కుమార్ !02/04/2014!

Friday, March 28, 2014

!!కొన్ని ప్రశ్నలు!!

గతించిన కాలాన్ని
సరికొత్తగా సుతిమెత్తగా స్పృశించి
కళ్లనుండి జారుతున్న జ్ఞాపకాలతో
కడుపు నింపుకుంటాను
ఆకలంటే అర్థమేమిటి?

శ్రీరంగాన్నో దేవులపల్లినో
ఆత్రేయనో వేటూరినో
దోసిట్లోకి ఒంపుకుని
తనివితీరా తాగేస్తాను
దాహమంటే ఏమిటి?

ఒకక్షణం ఆకాశవీధిలో
విహంగాన్నై విహరిస్తే
మరుక్షణం సాగరగర్భాన
చేపనై ఈతకొడతాను
నా ఇల్లెక్కడున్నట్టు?

ఇంకా,

నేటి నేనుగా
నిన్నల్లోకి పోయి నుంచుంటే
నాకు నేను
నవ్వులాటగా కనిపిస్తాను
మధ్యలో ఏం జరిగినట్టు?

ముద్దబంతి పువ్వుని
మురిపెంగా చూస్తుంటే
మొదటిప్రేమ గుర్తొచ్చి
మనసు ముద్దముద్దవుతుంది
ఆనాటి ప్రణయాలిప్పుడేమైనట్టు?

Monday, January 6, 2014

!!గమనం !!

బతుకుపుస్తకంలో
మరోపుట
భారంగా తిరగబోతోంది
రుధిరాక్షరాలను
లిఖించిన వారూ .. . 
రంగు రంగుల సంతకాలను
చెక్కినవారూ ...
ఎవరిని గుర్తుపెట్టుకుందాం?

కనికరంలేని కాలం
కన్నీటి చుక్కల్ని
ముత్యాలుగా చేసి మరోమాలకట్టింది
అదేకాలం
కల్మషంలేని కాలం
ఆనందాల్నీ అనుభూతుల్నీ కలిపి
అందమైన జ్ఞాపకాల్నిచ్చింది
వేటిని తీసుకెళ్దాం?

గాయాలగాతాన్ని
మోసుకుంటూ బయలుదేరితే
ప్రయాణం బరువవుతుంది
నవ్వులపువ్వుల్ని
కోసుకుంటూ నడకసాగితే
దారిపొడుగునా సుగంధమే!
నీకేదిష్టం ?