Sunday, April 4, 2010

అన్నీ కలలే...

అన్నీ కలలే... అంతటా కలలే..

చిధ్రమైన రైతు బతుకు
చిరునవ్వుల మయమైనట్టు
నేల తల్లి కడుపు పండి
నవ ధాన్యపు సిరులు పారినట్టు..

నేసి నేసి అలసి సొలసిన
నేతన్నల తెరువు భాసిల్లి
బలవంతపు మరణమాగి
భాగ్యరాసులు పొంగినట్టు..

బాలకార్మిక వ్యథల కథలలో
భంగపడిన పసిడి భవిత
బోసినవ్వుల జతనుగూడి
బడితలుపులు తట్టినట్టు..

వరకట్నపు చీడసోకి
వడలుతున్న మన సమాజం
"వద్దు" అనిచెప్పి, వరసకట్టి
వాస్తవికత పిచికారీ చేయించుకున్నట్టు..

కులముకులమని వెర్రులెత్తి
కుళ్ళుతున్న కుటిల జనం
కులమన్నది కాదు గెలుపు
కలిసుండటంఅని తెలిసినట్టు..

మనిషి మనిషికీ గోడ కట్టే
మనసులేని టెర్రరిస్టు
మనుషులంతా ఒక్కటన్న
మానవత్వపు రుచి మరిగినట్టు ...

పనికిరాని మాటలన్నీ
పక్కనెట్టి పాలకులు
ప్రజల మనసునెరిగి కరిగి
పరిపాలన సాగించినట్టు..

ప్రజలు స్వార్ధం మరచినట్టు..
పడతి ప్రగతికి చేరినట్టు..
లోకమంతా వెలిగినట్టు..
సుఖశాంతులు వర్ధిల్లినట్టు..

అన్నీ కలలే..అంతటా కలలే..

కానీ..
మనిషి మనసుతో చేయి కలిపి
సాటిమనిషిని ప్రేమిస్తే..స్వార్ధం లేకుండా కష్టిస్తే...
ఆశలన్నీ నెరవేరి అభివృద్ధి ఫలాలై దరిచేరగా
అన్నీ నవ్వులే..అంతటా సంతోషమే ..


(నిద్ర రాని ఓ శనివారం రాత్రి...నవీన్ కొమ్మినేని)